అర్జునుడి లాంటి సందిగ్ధత నాది...పవన్ సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనను అర్జునుడితో పోల్చుకోలేదు కానీ ఆయన కురుక్షేత్ర యుద్ధం ప్రారంభిస్తున్నపుడు పడిన సందిగ్దతను తాను 2024 ఎన్నికల ముందు ఎదుర్కొన్నాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు.;
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనను అర్జునుడితో పోల్చుకోలేదు కానీ ఆయన కురుక్షేత్ర యుద్ధం ప్రారంభిస్తున్నపుడు పడిన సందిగ్దతను తాను 2024 ఎన్నికల ముందు ఎదుర్కొన్నాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గీతా బోధన చేసిన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆ సందిగ్దతను తొలగించారని, తనకు వ్యక్తిగత లాభనష్టాల కంటే రాష్ట్ర ప్రజల సమగ్ర మేలు ప్రధానమని భావించే విధంగా జ్ఞాన బోధ ఆ సమయంలో కలిగిందని అన్నారు. అందుకే కేవలం 21 అసెంబ్లీ సీట్లకే పరిమితం అయి పోటీ చేశామని గతాన్ని గుర్తు చేసుకున్నారు.
ఒక అన్వేషకుడిని :
కర్ణాటకలోని ఉడిపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం నిర్వహించిన బృహత్ గీతోత్సవ మహోత్సవంలో మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆహ్వానం మేరకు పవన్ అక్కడికి వెళ్ళారు. ఈ సందర్భంగా భగవద్గీత గురించి ఆయన చేసిన ఆధ్యాత్మిక ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తాను భగవద్గీత ఒక ధర్మ తత్వంగా చూస్తాను అన్నారు. గీతాసారం ఎందరికో మార్గదర్శకత్వం అన్నారు. తాను ఈ వేడుకలకు ఆధ్యాత్మికతను అన్వేషించే సాధకుడిగా మాత్రమే వచ్చానని పవన్ స్పష్టం చేయడం విశేషం. ఇక నాయకత్వం అంటే పదవులు కాదని ప్రజల కోసం తీసుకునే మంచి నిర్ణయాలు ప్రయత్నాలు అని తాను గాఢంగా నమ్ముతాను అని పవన్ అన్నారు.
గొప్ప ఆధ్యాత్మిక శక్తి :
ఇక చూస్తే కనుక భగవద్గీత అనేది పూజా మందిరంలో ఉంచుకుని పూజించే ఒక పురాణ గ్రంథం ఎంత మాత్రం కాదని పవన్ అన్నారు. కెరీర్ కి పనికి వచ్చే గొప్ప జీవిత సారాంశం అని పవన్ అన్నారు. అలాగే జీవితంలో తనకు ఎదురయ్యే ఇబ్బందులు సందేహాలు అన్నవాటిని ప్రతి మనిషి దాటాల్సి ఉంటుందని ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలకు సరైన దిశలో నడిపించే ఒక సాధనం, మహోన్నత ఆధ్యాత్మిక శక్తి భగవద్గీత అని పవన్ అభివర్ణించారు. ఈనాటి యువతకు భగవద్గీత ఎంతో అవసరం అన్నారు. వారు చదువులో కానీ తమ వృత్తిలో కానీ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తూ భగవద్గీత ఎంతో మానసిక బలం ఇస్తుందని అన్నారు.
దేశాన్ని నిలబెట్టింది :
భారత్ దేశం మీద జరిగినన్ని దండయాత్రలు ఈ ప్రపంచంలో మరే దేశం మీద జరగలేదని పవన్ గుర్తు చేశారు. అయితే వాటిని తట్టుకుని భారత్ నిలబడడానికి కారణం ఆయుధ సంపత్తి ఏ మాత్రం కాదని అన్నారు. ఈ దేశం ధర్మం మాత్రమే ఆ శక్తిని ఇచ్చింది అని చెప్పారు. అలా ధర్మాన్ని నిలబెట్టిన గ్రంథాలు, సాధువులు, సంప్రదాయాలు, పవిత్ర సంస్థలు ఈ దేశానికి అసలైన బలం అని పవన్ అన్నారు. భగవద్గీతను కేవలం హిందువుల గ్రంధంగా ఎవరూ భావించరని, అది ఒక ఐన్‌స్టీన్ ఒక ఓపెన్‌హైమర్ వంటి మహా మేధావులను ప్రపంచంలోని గొప్పవారిని ఎంతో మందిని విశేషంగా ప్రభావితం చేసిందని ఆయన గుర్తు చేశారు.
అద్భుతంగా :
పవన్ లో ఇంతటి ఆధ్యాత్మికత ఉందా అనిపించేలా ఆయన ఉడిపిలో చేసిన అద్భుతమైన ప్రసంగం రుజువు చేసింది. ముఖ్యంగా భగవద్గీత గురించిన సారాంశాన్ని ఆయన వివరించిన తీరు కూడా ఎంతో గొప్పగా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ ఒక విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ఈ సభ ద్వారా మరోసారి రుజువు అయింది అని అంటున్నారు.