గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేయటానికి పోలింగ్ స్టేషన్ కు వెళ్లనక్కర్లేదట!

Update: 2020-09-18 04:30 GMT
డ్రాయింగ్ రూంలో కూర్చొని బోలెడన్ని మాటలు చెప్పే సగటు జీవి.. ఎన్నికల వేళ కీలకమైన పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేసే విషయంలో ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉరంతా ఒక దారైతే.. ఉలిపికట్టది మరో దారి అన్న చందంగా.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా.. పోలింగ్ శాతం ఎలా ఉన్నా.. హైదరాబాద్ మహానగరంలో మాత్రం పోలింగ్ శాతం తక్కువగా ఉండటం చూస్తుంటాం.

ఎందుకిలా? అంటే.. చాలానే కారణాలు చూపిస్తారు. మహానగర వాసులకు ఓటు వేసే విషయంలో వ్యవహరించే నిర్లక్ష్యం అంతా ఇంతా కాదు. దీన్ని అధిగమించేందుకు ఎన్నికల సంఘమే కొత్త విధానాల్ని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మరికొద్ది నెలల్లో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కు జరిగే ఎన్నికల్లో సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు.

పోలింగ్ శాతాన్ని పెంచేందుకు.. పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటు వేయటానికి ఇష్టపడని వారు ఇంట్లోనే కూర్చొని ఓటు వేసే సరికొత్త ‘‘ఈ-ఓటింగ్’’ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ మహానగరం మొత్తం కాకున్నా.. కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.

ఈ ఆలోచన ఏ మేరకు సాధ్యమన్న విషయంపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యయనం చేస్తుంది. అది విజయమైతే మిగిలిన ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేసే వీలుంది. అయితే.. ఈ కొత్త విధానం అమలుకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు వీలుగా ఆన్ లైన్ లో ఓటు విలువను తెలిపేలా పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. మరి.. ఈ కొత్త విధానంలో అయినా.. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు ఎలా రియాక్టు అవుతారో చూడాలి. తాజాగా తెర మీదకు వచ్చిన ఈ కొత్త ఈ - ఓటింగ్ ఎలా ఉంటుందో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
Tags:    

Similar News