గ్రేటర్ వేళ.. పోస్టు పెడుతున్నారా బీకేర్ ఫుల్

Update: 2020-11-23 11:30 GMT
అప్పుడు ఇప్పుడు జరిగే ఎన్నికలే జరుగుతున్నా.. ప్రచారం మొదలు.. ఎత్తులు వేస్తున్న తీరు మొత్తంగా మారింది. సాంకేతికతను అందిపుచ్చుకొని ఎన్నికల యుద్ధాన్ని సరికొత్త తీరాలకు తీసుకెళుతున్నారు. చెబితే నిజాలు చెప్పాలి.. లేదంటే నోరు మూసుకోవాలన్న నాటి రోజులకు బదులుగా నిజం చెప్పినా చెప్పకున్నా.. అబద్ధాలు చెప్పాలి.. అందరిని ఆకర్షించాలన్న కొత్త ధోరణి షురూ అయ్యింది. ఎవరికి వారు వారి వాదనలు వినిపించే క్రమంలో అసత్యాల్ని ప్రచారం చేయటం ఈ మధ్యన అంతకంతకూ పెరుగుతోంది. అంతేకాదు.. నోటికి వచ్చినట్లుగా తిట్టేసే ధోరణి పెరిగింది.

వీటన్నింటిని నేరుగా పోస్టు చేయకుండా.. ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి.. వైరల్ చేయటం ఈ మధ్యన పెరిగింది. గతంలో ఇలాంటివి వ్యక్తులు.. సానుభూతిపరులు చేసేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా రాజకీయ పార్టీలే ప్రత్యేకంగా విభాగాల్ని ఓపెన్ చేసి మరీ వైరల్ పోస్టుల్ని తయారు చేస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వాటిని పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చేలా ప్రత్యేక వ్యూహాల్ని సిద్ధం చేస్తున్నారు.

ఇవేమీ తెలీక.. అమాయకపు అభిమానంతో తమ మనసుకు నచ్చిన పోస్టుల్ని యథాతధంగా కొందరు.. అసలు పోస్టుకు మరింత మసాలా జోడించి పోస్టులు పెడుతున్నవారి సంఖ్య తక్కువేం కాదు. ఇలాంటి వారందరికి ఇప్పుడు కొత్త సవాలు ఎదురుకానుంది. గ్రేటర్ ఎన్నికల్లో బయట ప్రచారం కన్నా.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతకంతకూ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో.. వీటిపై పోలీసులు ప్రత్యేక నిఘాను పెడుతున్నారు.

హద్దులు దాటిన పోస్టులపై చర్యలు తీసుకోవటంతో పాటు.. కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు ఎవరైనా ఫిర్యాదులు చేసినా.. ఏ పార్టీ అయినా.. కొన్ని సంస్థలు తమకు అందిన సమాచారాన్ని పోలీసులకు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరేవారు. అయితే.. పోస్టుల జోరు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. హద్దులు దాటే పోస్టుల్ని గుర్తించటం.. వాటిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సో.. అభిమానం పేరుతో అత్యుత్సాహానికి పోయి.. కేసుల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఊరించే పోస్టుల్ని... ఉత్సాహంతో పది మందికి షేర్ చేయటం కూడా చిక్కుల్లో పడేసే ఛాన్సు ఉందన్నది మర్చిపోవద్దు. బీకేర్ ఫుల్.
Tags:    

Similar News