ఎన్టీఆర్ నాదెండ్ల ఫస్ట్ టైం కలిసింది ఎక్కడంటే ?

ఇటీవల దివంగతులు అయిన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు రాజకీయ జీవితంలో ఏ సినిమాలోనూ లేనన్ని ట్విస్టులు ఉన్నాయి.;

Update: 2026-04-25 01:30 GMT

ఇటీవల దివంగతులు అయిన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు రాజకీయ జీవితంలో ఏ సినిమాలోనూ లేనన్ని ట్విస్టులు ఉన్నాయి. ఆయన రాజకీయంగా ఉన్నత పదవులు చేపట్టినా కుదురుకోకపోయి ఉండవచ్చు. రాజకీయంగా చాలా కాలం ప్రత్యక్షంగా దూరంగా ఉండవచ్చు కానీ నాదెండ్ల అనగానే రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి అదొక రకమైన ఆసక్తి. ఆయన తన ఆత్మ కధలో తన మొత్తం రాజకీయం గురించి రాసుకున్నారు. ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు. తాను రాజకీయాల్లో ఎలా వచ్చాను ఎలా ముందుకు వెళ్ళాను అన్నది కూడా ఎక్కడా తుచ తప్పకుండా రాసుకున్నారు. అఫ్ కోర్స్ ఆయన మీద వెన్నుపోటు ముద్ర ఉంది. అయితే చరిత్ర ఎవరేమిటి అని నిర్ణయిస్తుంది అని అనేక సందర్భాలలో చెప్పిన నాదెండ్ల రాజకీయ జీవితంలోకి ఎన్టీఆర్ వచ్చారా లేక ఎన్టీఆర్ జీవితంలోకి నాదెండ్ల వెళ్లారా అంటే అదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇక ఇంతగా మాట్లాడుకుంటున్న వేళ అసలు ఎన్టీఆర్ నాదెండ్ల తొలి భేటీ ఎపుడు ఎక్కడ జరిగింది. ఈ ఇద్దరికీ పరిచయం ఎప్పటి నుంచి ఉంది ఏమిటి కధ అన్నది కూడా చాలా ఆసక్తికరం.

తిరుపతి ఎయిర్ పోర్టులో :

నాదెండ్ల చెన్నారెడ్డి మంత్రివర్గంలో కీలక శాఖలు చూస్తూ వస్తున్నారు. ఆయన తన శాఖకు సంబంధించిన పని మీద అప్పట్లో మద్రాస్ వెళ్లాల్సి ఉంది. దాంతో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అప్పట్లో డైరెక్ట్ ఫ్లైట్ మద్రాస్ కి లేదు. తిరుపతిలో హాల్ట్ చేసి వెళ్ళాల్సి ఉంది. దాంతో తిరుపతి ఎయిర్ పోర్టులో వేచి ఉన్న నాదెండ్ల వద్దకు ఎన్టీఆర్ వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నారు అని నాదెండ్ల చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన మాట. తాను సినిమాలు అవీ పెద్దగా చూడనని అందుకే తనకు రామారావుతో వ్యక్తిగతంగా పరిచయం లేకపోవడం వల్ల తొలి భేటీలో పెద్దగా మాట్లాడింది లేదని చెప్పారు. మద్రాస్ వస్తున్న నాదెండ్లను తన ఇంటికి రావాలని ఎన్టీఆర్ కోరారు. అయితే తనకు ఉన్న పని ఒత్తిడి వల్ల కుదర లేకపోయింది అని నాదెండ్ల చెప్పారు. అలా ఇద్దరూ తొలి భేటీ వేసుకున్నది తిరుపతి ఎయిర్ పోర్టులో అన్న మాట. కట్ చేస్తే రెండవ భేటీ ఎక్కడ అన్నది కూడా ఆసక్తికరమే.

సెకండ్ భేటీ కొండ మీద :

ఇక రెండవ భేటీ అన్నది అన్నవరం సత్యదేవుడి కొండ మీద అతిధి గృహంలో అని నాదెండ్ల చెప్పారు. తాను వ్యవసాయ శాఖ మంత్రిగా గోదావరి జిల్లాలో పర్యటించి రాత్రికి సత్యదేవుడి సన్నిధానం చేరుకుని కొండ మీద అతిథి గృహంలో బస చేశాను అని నాదెండ్ల చెప్పారు. అయితే తాను అక్కడికి వచ్చిన సంగతి ఎవరు చెప్పారో తెలియదు కానీ తెల్లారేసరికి ఎన్టీఆర్ అక్కడికి వచ్చారని చెప్పారు. అలా ఇద్దరం కొంతసేపు కబుర్లు చెప్పుకున్నామని నాదెండ్ల వెల్లడించారు. ఆ భేటీ తరువాత మూడవ భేటీ అన్నది ఏకంగా నాదెండ్ల ఇంట్లోనే జరిగింది. హైదరాబాద్ లో షూటింగ్ కోసం వచ్చిన ఎన్టీఆర్ తెల్లారుతూనే ఉదయం ఆరు గంటలకు నాదెండ్ల ఇంటికి వచ్చారట. అలా ఇద్దరూ కొంత సేపు మాట్లాడుకున్నారు. ఈ భేటీలోనే మరో గమ్మత్తు అయిన విషయం జరిగింది.

రాజకీయాల ప్రస్తావన :

తనతో తరచూ భేటీలు వేయడం ఫోన్ సంభాషణలు జరపడంతో అప్పటికే కొత్తగా ప్రాంతీయ పార్టీని పెట్టాలని చూస్తున్న నాదెండ్ల భాస్కరరావుకు ఎన్టీఆర్ ఎందుకు తనను కలుస్తున్నారు అన్న డౌట్ వచ్చి మీరు రాజకీయాల్లోకి వస్తారా అని అడిగారుట. దానికి రామారావు షష్టి పూర్తి అయ్యేంతవరకూ సినిమాలే. ఆ తరువాతనే అంతా అని చెప్పారుట. ఇక ఆ తరువాత నాదెండ్ల ఎన్టీఆర్ ల మధ్య మరింతగా పరిచయాలు పెరిగి కొత్త ప్రాంతీయ పార్టీ విషయంలో ఇద్దరూ కలసి పనిచేయడం దాని పేరు తెలుగు దేశం పార్టీ అని పెట్టడం జరిగాయని నాదెండ్ల చెప్పుకొచ్చారు. మొత్తానికి నాదెండ్ల ఎన్టీఆర్ ల భేటీలు ఉమ్మడి ఏపీలో రాజకీయ సంచలనాన్ని సృష్టించాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News