యనమల తీరుతో గంటా ఆవేదన!

Update: 2018-01-21 06:55 GMT
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుపై మండిపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా పార్టీ సమన్వయ సమావేశంలో చంద్రబాబు గంటాకు సుతిమెత్తగా హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఇదంతా జరిగినట్లు చెప్తున్నారు. అయితే, చంద్రబాబు హెచ్చరికలు కంటే దానికి మరో మంత్రి యనమల వంత పాడడంతో గంటా మండిపడుతున్నట్లు తెలుస్తోంది.
    
పార్టీ కోసం గంటా ఎక్కువ సమయం కేటాయించాలంటూ చంద్రబాబు ఆ సమావేశంలో సూచించారు.. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా యనమల దానికి వంత పాడారు. యనమల తీరుతో గంటా ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది. చంద్రబాబుకైతే చెప్పే అధికారం ఉంది కానీ, సాటి మంత్రి కూడా తనకు సలహాలు ఇవ్వడంతో గంటా నొచ్చుకున్నారని చెబుతున్నారు.
    
కాగా కొన్నాళ్లుగా గంటా యాక్టివ్‌గా కనిపించడం లేదు, పైగా... ఎన్నికలు వచ్చే సమయంలో ఆచితూచి అడుగులు వేసే అలవాటున్న గంటా తీరుపై చంద్రబాబు - టీడీపీలో మరికొందరు పెద్దలు చాలాకాలంగా అనుమానపు చూపులు చూస్తున్నారు. అంతలోనే తాజా సర్వేలు టీడీపీ బలం తగ్గిందని చెప్తుండడంతో గంటా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్న అనుమానాలు కూడా ఉన్నాయంటున్నారు.
    
మరోవైపు విశాఖలో బీజేపీ బలపడుతోందని, టీడీపీ జోష్ తగ్గిందని చంద్రబాబుకు సమాచారం ఉందని.. గంటా యాక్టివ్‌గా లేరని, పార్టీని బలోపేతం చేయడంపై ఆయన దృష్టి పెట్టడం లేదని ఆయన ఇటీవల అన్నట్లు కూడా చెప్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలోనే ఆయన పార్టీ సమావేశంలో అందరి ముందు గంటాను మందలించారు. పార్టీ కోసం సమయం కేటాయించాలని చెప్పారు. అంతవరకు బాగానే ఉన్నా, దానికి యనమల సమర్ధించడంతో గంటా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి, టీడీపీ మంత్రుల మధ్య ఈ లొల్లి ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
Tags:    

Similar News