గంటా పార్టీ మారడం ఖాయమేనా?.. ఇదిగో ఇదే సాక్ష్యం

Update: 2019-05-27 12:40 GMT
గంటా శ్రీనివాసరావు... రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి వరుసగా ఐదు ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్న నేతగా రికార్డు నెలకొల్పారు. ఆ రికార్డు కూడా అన్ని సార్లు కూడా ఓకే నియోజకవర్గానికి అట్టిపెట్టుకోకుండా... ఒక్కో ఎన్నికకు ఒక్కో నియోజకవర్గాన్ని ఎంచుకుని తనదైన శైలి విక్టరీలను సాధిస్తున్నారు. అంతేకాదండోయ్... ఇప్పటిదాకా మూడు పార్టీల టికెట్లపై పోటీ చేసిన గంటా ఒక్క పార్టీ తరఫున కూడా ఓటమి చెందలేదు. ఇక పదవుల విషయానికి వస్తే... అటు కాంగ్రెస్ తో పాటు ఇటు టీడీపీలోనూ మంత్రి పదవి కొట్టేసిన నేతగానూ గంటాకు మంచి రికార్డే ఉంది.

అయినా ఇప్పుడు గంటాకు సంబంధించి ఇంత సోదీ చెప్పుకోవాల్సిన అవసరం ఏముందన్న విషయానికి వస్తే... ఈ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఫ్యాన్ గాలికి హేమాహేమీలంతా కొట్టుకుపోయారు. అయితే గంటా మాత్రం నియోజకవర్గం మారినా కూడా గెలిచేశారు. ఈ క్రమంలో సోమవారం విశాఖలో జరిగిన మీట్ ద ప్రెస్ లో చాలా విషయాలే మాట్లాడిన ఆయన... ఏ ఒక్కరూ అడగకున్నా తాను పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. అయినా గంటా లాంటి నేతలకు ఒక్కచోట కుదురుగా ఉండే అలవాటు ఉండదు. ఇప్పటికే టీడీపీ - ప్రజారాజ్యం - కాంగ్రెస్ పార్టీలు మారిన ఆయన ప్రస్తుతం తనకు రాజకీయ ఓనమాలు దిద్దించిన టీడీపీలోనే ఉన్నారు. మొన్నటి ఎణ్నికలకు ముందు గంటా వస్తే... పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్వయంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక వైసీపీలోకి చేరాలనుకున్నా... ఆయనకు అక్కడా నో ఎంట్రీ బోర్డే. ఇఖ అయితే గియితే... బీజేపీలో చేరాలి. గంటా లాంటి నిలకడ లేమి నేతలకు బీజేపీ ఏమాత్రం స్వాగతం పలుకుతుందో చూడాల్సిందే. ఇన్ని ప్రతికూలతలు పెట్టుకుని అసలు గంటా పార్టీ మారుతున్నారని ఏ ఒక్కరూ చెప్పకుండానే... తనకు తానుగా లీకులు ఇచ్చేసుకున్నట్లుగా గంటా... తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని సంచలన ప్రకటన చేశారు. అంతేకాదండోయ్.,. తాను బతికున్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతానని - చంద్రబాబును వీడి ఎక్కడికీ వెళ్లేది లేదని కూడా గంటా తేల్చి పారేశారు. ఈ తరహా వ్యాఖ్యలు గంటా నోట నుంచి వస్తుంటే.. నిజంగానే పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకునే క్రమంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



Tags:    

Similar News