వైసీపీ వాళ్ల మీద ఇదేమీ దౌర్జన్యం వంశీ?

Update: 2020-10-05 04:15 GMT
టీడీపీకి.. వైసీపీకి పెద్దగా తేడా ఏమీ లేదు అని రాష్ట్రంలో అంటున్నారు. ఆ రోజు చంద్రబాబు రాజకీయ అనుభవం పక్కనపెట్టి అనుభవం లేని లోకేష్ మాటలు విని రాష్ట్రంలో వైసీపీ లేకుండా చేయాలనే పిచ్చి ఆలోచనతో వైసీపీ గుర్తు మీద గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి అధికారికంగా చేర్చుకున్నారు.   అసెంబ్లీ స్పీకర్ ను గుప్పిట్లో పెట్టుకొని వాళ్లపై అనర్హత వేటు వేయకుండా ఏకంగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు.  

అదే విధంగా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్లను గంపగుత్తగా చేర్చుకొని టీడీపీ వాళ్లకు అన్యాయం చేశారు. ఈ సందర్భంలో టీడీపీ కార్యకర్తలకు కోపం వచ్చి 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని పనులు చేసినా ఓడించారు. ఏపీలో రాజకీయంగా టీడీపీని హత్య చేసేసి కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు.

అది ఒక ఎత్తు అయితే.. నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి చనిపోయిన తరువాత శిల్పా చక్రపాణి రెడ్డిని వైసీపీలోకి  చేర్చుకున్నప్పుడు రాజీనామా చేయించి మరీ అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆదర్శంగా నిలిచారు.   రాష్ట్రంలో ఉన్న అందరు మేధావులు, న్యూట్రల్ పీపుల్ అంతా ‘శభాష్’ అని జగన్ ను ఆ సమయంలో పొగిడారు.

ఇలాంటి మంచి రాజకీయ నాయకుడు కావాలని టీవీ చర్చల్లో విశ్లేషకులందరూ జగన్ గురించి నాడు గొప్పగా చెప్పారు. కానీ ఇప్పుడు 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన జగన్ కు ఆ సీట్లు సరిపోవడం లేదా అని అంటున్నారు. టీడీపీ వాళ్లను చేర్చుకుంటూ సొంత వైసీపీ వాళ్ల మీద వారు కేసులు పెడుతున్నారు. స్వయంగా వైసీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు సైతం వైసీపీ వాళ్లపై కేసులు పెడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని బాధితులు వాపోతున్నారు.
 
తాజాగా గన్నవరంలో అయితే టీడీపీ మీద.. వంశీ మీద ఫైట్ చేయాలని.. డబ్బులు ఉన్న వెంకట్ రావును తీసుకొని వచ్చి అక్కడి వైసీపీ నేత దుట్టా రాంచంద్రారావుతో కంప్రమైజ్ చేశారు.. దుట్టా కూడా జగన్ ముఖ్యం అని వెంకట్ రావుకు సపోర్టు చేశాడు. అయితే కొద్దిపాటి మెజారిటీతో గత ఎన్నికల్లో వెంకట్ రావు ఓడిపోయి..టీడీపీ నుంచి వల్లభనేని వంశీ గెలిచాడు.

ఇప్పటికీ గన్నవరంలో వల్లభనేని వంశీ.. ఏపీ సీఎంను ఏ విధంగా తిట్టాడో.. ఏ విధంగా ‘ఎవరు వాడని పదజాలంతో’ దూషించాడో తెలుసు.. దీనిపై వైసీపీ వాళ్లు అంతా వంశీని దుమ్మెత్తిపోసిన వారు కూడా ఉన్నారు.

ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గన్నవరంలో ఓ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపనలో ఎమ్మెల్యే వంశీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో అసమ్మతి చెలరేగింది.  కొబ్బరికాయ కొట్టే కార్యక్రమంలో ఎప్పటి నుంచో ఉన్న నిజమైన  వైసీపీ నేతలపై వంశీ అనుచరులు తిరగబడడం కనిపించింది. వంశీ ముందరే నేతలు అడ్డుకొని కొట్టుకోవడం.. వంశీ సదురు నేతలను తోసేస్తూ ఆగ్రహం వ్యక్తం చేయడం వీడియోలో కనిపించింది. ఆ వీడియో వైరల్ కూడా అయ్యింది. నిజమైన వైసీపీ వాళ్ల మీద వంశీ అనుచరులు దాడులు చేసినట్టు ఆ వీడియోను షేర్ చేస్తూ కొందరు ప్రచారం చేస్తున్నారు.  దీంతో గన్నవరంలో ఉన్న నిజమైన వైసీపీ వాళ్లకు.. వంశీతోపాటు వచ్చిన ఆయన అనుచరులకు పడదన్న విషయం అర్థమైంది.

ఇలాంటి వంశీని ఇప్పుడు వైసీపీలో చేర్చుకోవడాన్ని గన్నవరంలోని వైసీపీ అభిమానులు జీర్ణించుకోవడం లేదట. వైసీపీనే నమ్ముకొని ఉన్న వారిపై ఏంటి అన్యాయం అని వారంతా ప్రశ్నిస్తున్నారు.  అందుకే  సోషల్ మీడియాలో ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఉన్న ఒక మంత్రి వలన వంశీ వైసీపీలోకి వచ్చాడని కూడా ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా వైసీపీ హైకమాండ్ స్పందించి వైసీపీ వాళ్లకు న్యాయం చేయాలని అంటున్నారు.


Full View
Tags:    

Similar News