గ్రౌండ్ రిపోర్ట్!... గాజువాకలో గెలుపెవ‌రిది?

Update: 2019-03-21 04:49 GMT
అభ్య‌ర్థులు:

టీడీపీ:.. ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు
వైసీపీ:  తిప్ప‌ల నాగిరెడ్డి
జ‌న‌సేన‌:  ప‌వ‌న్ క‌ల్యాణ్
బీజేపీ:  పులుసు జ‌నార్ద‌న్‌

మొత్తం ఓట‌ర్ల సంఖ్య‌:  2,62,369
గాజువాక మొత్తం జనాభా: 4,22,018

పురుషులు : 134152
స్త్రీలు : 128211
ఇతరులు : 6

ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే: ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు (టీడీపీ)

విశాఖప‌ట్నం జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యం క‌లిగిన అసెంబ్లీ నియోక‌వ‌ర్గాల జాబితాలో గాజువాక రెండోదిగా ఉంది. సింగిల్ మండ‌లంతోనే ఏర్ప‌డిపోయిన గాజువాక‌లో ఇప్ప‌టిదాకా రెండు ద‌ఫాలుగా ఎన్నిక‌లు జ‌రిగితే... ఫ‌స్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం త‌ర‌ఫున పోటీ చేసిన చింత‌ల‌పూడి వెంక‌ట్రామ‌య్య జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో (2014) ప్ర‌జారాజ్యం అడ్రెస్ లేకుండా పోగా... వైసీపీ కొత్త‌గా బ‌రిలోకి దిగింది. అయితే వైసీపీ అభ్య‌ర్థిని ఓడించిన టీడీపీ అభ్య‌ర్థి ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప‌ల్లా... మ‌రోమారు టీడీపీ టికెట్ ను ద‌క్కించుకోగా... వైసీపీ అభ్య‌ర్థిగా మ‌రోమారు తిప్ప‌ల నాగిరెడ్డి టికెట్ సాధించారు. ఇక ఇక్క‌డ తొలి విజ‌యం ప్ర‌జారాజ్యానిది కాగా... ఇప్పుడు ఈ సీటులో జెండా ఎగుర‌వేసేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏకంగా స్వ‌యంగానే రంగంలోకి దిగిపోయారు.

విశాఖ పార్ల‌మెంటు ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టిగా ఉన్న గాజువాక‌... ప‌వ‌న్ బ‌రిలోకి దిగ‌డంతో ఇప్పుడు సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్‌ గా నిలిచింద‌ని చెప్పాలి. అన్న‌య్య చిరు సెంటిమెంట్ క‌లిసి వ‌స్తుంద‌ని త‌మ్ముడు ప‌వ‌న్ బ‌రిలోకి దిగ‌గా... ఇప్ప‌టికే రెండు సార్లు బ‌రిలోకి దిగి... ముచ్చ‌ట‌గా మూడో ప‌ర్యాయం కూడా ఇక్క‌డి నుంచే పోటీ చేస్తున్న వైసీపీ అభ్య‌ర్థి తిప్ప‌ల నాగిరెడ్డి... అటు ప‌వ‌న్ తో పాటు ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస‌రావుకు చెమ‌ట‌లు ప‌ట్టించ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ప్ర‌జారాజ్యం గెలిచిన సారి ఇక్క‌డి నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన తిప్ప‌ల నాగిరెడ్డి... ఏకంగా కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికి నెట్టేసి... రెండో స్థానంలో నిలిచారు. నాడు పీఆర్పీ అభ్య‌ర్థి వెంక‌ట్రామ‌య్య‌కు 50,994 ఓట్లు రాగా... తిప్ప‌ల నాగిరెడ్డికి 33,087    ఓట్లు ప‌డ్దాయి. ఇక కాంగ్రెస్ త‌ర‌ఫున నాడు బ‌రిలోకి దిగిన తిప్ప‌ల గురుమూర్తి రెడ్డికి 29,547 ఓట్లు మాత్ర‌మే ప‌డ్డాయి.

ఆ త‌ర్వాత 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పీఆర్పీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రెస్ లేకుండా పోవ‌డంతో ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు - తిప్ప‌ల నాగిరెడ్డిల మ‌ధ్యే పోటీ నెల‌కొంది. ఆ ఎన్నిక‌ల్లో గాజువాక ఓట‌ర్ల సంఖ్య భారీగా పెర‌గ‌గా... వీరిద్ద‌రు సాధించిన ఓట్లు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. ప‌ల్లాకు 97,109 ఓట్లు రాగా... వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన తిప్ప‌ల‌కు 75,397 ఓట్లు ప‌డ్డాయి. గెలిచిన అభ్య‌ర్థికి తొలి సారి కంటే రెండో సారి కాస్తంత మెజారిటీ పెరిగినా... తిప్ప‌ల మాత్రం త‌న ఓట్ల షేరింగ్‌ ను భారీ ఎత్తున పెంచేసుకున్నారు. ఇక 2014లో ప‌ల్లాకు టీడీపీ ఓటింగ్ తో పాటు బీజేపీ - జ‌న‌సేన ఓటింగ్ కూడా క‌లిస్తేనే 97,109 ఓట్లు వ‌చ్చాయి. తిప్ప‌ల మాత్రం సింగిల్ గానే 75,397 సంపాదించారు. ఇదంతా గ‌తం అనుకుంటే... ప్ర‌స్తుతం ఇక్క‌డ ఇప్పుడు త్రిముఖ పోటీ నెల‌కొంది. బ‌రిలో అధికార టీడీపీ - విప‌క్ష వైసీపీతో పాటు జ‌న‌సేన కూడా ఉన్నాయి. ఈ మూడు పార్టీల‌తో పాటు అంతోఇంతో ఒటింగ్ ఉన్న బీజేపీ కూడా త‌న అభ్య‌ర్థిగా పులుసు జ‌నార్ధ‌న్‌ ను దించేసింది. ఈ లెక్క‌న గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ప‌ల్లాకు వ‌చ్చిన 97,109 ఇప్పుడు మూడు ముక్క‌లు కానున్నాయ‌న్న మాట‌. ఈ వాటాల్లో ఎవ‌రికి ఎక్కువ‌గా ఓట్లు ప‌డతాయ‌న్న విష‌యంపై ఇప్పుడ‌ప్పుడే స్ప‌ష్ట‌త లేకున్నా... వైసీపీ ఓటు బ్యాంకు మాత్రం చీల‌లేద‌నే చెప్పాలి. అదే స‌మ‌యంలో నియోక‌జ‌వ‌ర్గం ఏర్ప‌డిన నాటి నుంచి అక్క‌డి ప్ర‌జ‌ల‌తోనే మ‌మేకం అవుతూ వ‌స్తున్న తిప్ప‌ల నాగిరెడ్డి... ఈ ద‌ఫా విజ‌యం త‌న‌దేన‌న్న ధీమాతో ఉన్నారు. ఎందుకంటే... రెండు సార్లు ఓడినా కూడా త‌న ఓటింగ్ ను మాత్రం ఆయ‌న భారీగానే పెంచుకున్నారు. అంతేకాకుండా ఓడినా కూడా నియోజ‌క‌వ‌ర్గాన్ని - అక్క‌డి ప్ర‌జ‌ల‌ను వ‌దిలేసి వెళ్లిపోకుండా స్థిరంగా ఉండిపోయారు.

ఇక అన్నింటికంటే ముఖ్యంగా ప్ర‌స్తావించుకోవాల్సిన విష‌యం ఏమిటంటే... ఇక్క‌డి నుంచి ప‌వ‌న్ కల్యాణ్ పోటీకి దిగుతుండ‌ట‌మే. త‌న సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట్లు భారీ సంఖ్య‌లో ఉండ‌టం - కొత్త ఓట‌ర్ల న‌మోదు రికార్డు సృష్టించిన నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో యువ‌త భారీ ఎత్తున ఉంద‌న్న భావ‌న‌తో ప‌వ‌న్ ఇక్క‌డ పోటీకి దిగారు. అయితే త‌న సొంత సామాజిక వ‌ర్గం ఓట్ల‌న్నీ త‌న‌కే వ‌స్తాయ‌న్న ధీమా ప‌వ‌న్‌ కు లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... ఇటు ప‌ల్లా - తిప్ప‌ల‌తో పాటుగా బీజేపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగుతున్న పులుసు జనార్ద‌న్ ప‌క్కా లోక‌ల్‌. జీవీఎంసీ మేయరుగా 2007 నుంచి 2012వరకూ పనిచేసిన పులుసు... గాజువాకలో రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశారు. ఈ క్ర‌మంలో పులుసు కూడా ఓ మోస్త‌రు ఓట్ల‌ను త‌న ఖాతాలో వేసుకునే తీర‌తారని చెప్ప‌క త‌ప్ప‌దు. పులుసు - తిప్ప‌ల‌తో పాటు ప‌ల్లా కూడా లోక‌లే. ఒక్క ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్ర‌మే ఇక్కడ నాన్ లోక‌ల్‌. అయితే సినీ ఇమేజీతో భారీ అభిమాన ధ‌నాన్ని సంపాదించుకున్న ప‌వ‌న్‌... త‌న అభిమానులు - సొంత సామాజిక వ‌ర్గం క‌లిస్తే.... ఇక తిరుగుండ‌ద‌ని భావిస్తున్నారు. మ‌రి ఈ ఈక్వేష‌న్స్ ఏ రీతిన వ‌ర్క‌వుట‌వుతాయో చూడాలి.
4

టీడీపీ అభ్య‌ర్థి ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు బలాలు

# స్థానికుడు
# ఇచ్చిన హామీల్లో 92 శాతం నెర‌వేర్చాన‌ని ప్ర‌చారం చేసుకుంటుండ‌టం
# ఈ ఐదేళ్ల‌లో అభివృద్ధి ప‌నులు
 
బ‌ల‌హీన‌త‌లు

# పార్టీలో అస‌మ్మ‌తి
# చివ‌రి దాకా టికెట్ పై స‌స్సెన్స్‌
# రెబెల్ గా టీడీపీ  కార్పొరేట‌ర్ బ‌రిలోకి దిగుతుండ‌టం

వైసీపీ అభ్య‌ర్థి తిప్ప‌ల నాగిరెడ్డి బ‌లాలు

# స్థానికుడు
# ప్ర‌భుత్వ ఉద్యోగిగా స్థానికుల‌తో మ‌మేకం అయిన నేప‌థ్యం
# పార్టీలో త‌న‌పై న‌మ్మ‌కం
# వ‌రుస‌గా రెండు సార్లు ఓట‌మి - అయినా నియోజ‌క‌వ‌ర్గాన్ని వీడ‌ని తీరు

బ‌ల‌హీన‌త‌లు
# పోటీ చేసిన రెండు సార్లూ ఓట‌మి
# నాలుగు స్తంబాలాట‌

జ‌న‌సేన అభ్య‌ర్థి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ బ‌లాలు

# అశేష అభిమాన ధ‌నం
# స‌మాజంపై విస్తృత అవ‌గాహ‌న ఉంద‌న్న భావ‌న‌
# భారీ సంఖ్య‌లో సొంత సామాజిక వ‌ర్గ ఓట‌ర్లు
# చిరు పార్టీ సెంటిమెంట్ క‌లిసొస్తుంద‌న్న భావ‌న‌

బ‌లహీన‌త‌లు

# నాన్ లోకల్‌
# సింగిల్ సీటుకు పోటీపై న‌మ్మ‌కం లేక రెండో స్థానం నుంచి పోటీ అన్న భావ‌న‌
# గెలిపిస్తే... ప‌ట్టించుకుంటార‌న్న గ్యారెంటీ లేక‌పోవ‌డం

బీజేపీ అభ్య‌ర్థి పులుసు జ‌నార్ద‌న్ బ‌లాలు

# స్థానికుడు
# మేయ‌ర్‌ గా గాజువాక‌లో అభివృద్ధి పనులు
# గాజువాక‌తో పాటు న‌గ‌ర వ్యాప్తంగా మంచి ప‌రిచయాలు

బ‌ల‌హీన‌త‌లు

# నింపాదిగా పార్టీ వ్య‌వ‌హారం
# లేశ మాత్రంగా బీజేపీ శ్రేణులు

ఇలా నాలుగు పార్టీల అభ్య‌ర్థుల‌కు కొన్ని ప్ల‌స్‌ ల‌తో పాటు మ‌రికొన్ని మైన‌స్‌ లూ ఉన్నాయి. అయితే గ‌డ‌చిన ఎన్నిక‌ల నాటి ప‌రిస్థితితో ఇప్ప‌టి ప‌రిస్థితిని కాస్తంత పోల్చి చూస్తే.. జ‌న‌సేన‌ - బీజేపీల ఓటింగ్ చీల‌డంతో ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు దెబ్బ ప‌డే ప్ర‌మాదం లేక‌పోలేదు. అదే స‌మ‌యంలో టీడీపీ - బీజేపీ ఓటింగ్ లేకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంతంగా ఏ మేర‌కు రాణిస్తారన్న‌ది ఇప్పుడు అతి పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. అయితే కొత్తగా న‌మోదైన ఓట్ల‌న్నీ త‌న‌కే ప‌డ‌తాయ‌ని - దానికి తోడు ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న త‌న సామాజిక వ‌ర్గం ఓట్లు తోడైతే త‌న గెలుపున‌కు ఢోకా లేద‌న్న ధీమాతో ప‌వ‌న్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే టీడీపీ - జ‌న‌సేన‌ - బీజేపీల ఓటింగ్ ఎవ‌రికి వారుగా చీలుతుండ‌టం... వైసీపీ ఓటింగ్ మాత్రం చెక్కుచెద‌ర‌కుండా ఉండ‌టం తిప్ప‌ల‌కు క‌లిసి వ‌స్తుంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న‌దైన మేనియాతో ప‌వ‌నో - లేదంటే ప‌టిష్ట‌మైన ఓటు బ్యాంకుతో తిప్ప‌ల‌నో విజ‌యం వ‌రించే అవ‌కాశాలున్నాయి. ఈ ద‌ఫా ఇక్క‌డ టీడీపీ మాత్రం విజ‌యం సాధించే అవ‌కాశాలే లేవ‌న్న‌ది అంద‌రూ చెబుతున్న మాట‌గా వినిపిస్తోంది. అయితే ఎవ‌రి మాట ఎలా ఉన్నా... పోలింగ్ నాడు ఓట‌ర‌న్న ఎవ‌రికి ఓటేసి వ‌స్తే... వారిదే గెలుప‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News