సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు 'ఫైనాన్స్‌' భయం..!

Update: 2019-02-16 04:51 GMT
ఎన్నికల్లో పోటీ చేయాలంటే అంగబలం - అర్థబలం ఉంటే సరిపోదు. ధనబలం కూడా కచ్చితంగా అవసరమేనని నేటి రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది.   పరిమితికి మించి డబ్బులు ఖర్చుపెట్టొద్దని ఎన్నికల కమిషన్‌ ఎన్ని నిబంధనలు పెట్టినా పట్టించుకోని కొందరు ఎన్నికల్లో డబ్బులను నీళ్లలా ఖర్చు చేస్తుంటారు. ఒకరి కంటే మరొకరు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తూ విజయం సాధిస్తుంటారు.  ఈ నేపథ్యంలో ఎంతో కొంత ఆర్థిక వనరులు సమకూర్చుకున్న తరువాతే పోటీకి రంగంలోకి దిగడానికి నేటి నేతలు రెడీ అవుతున్నారు.

త్వరలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నుంచి టిక్కెట్టు కోసం నాయకులు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ప్రధాన పార్టీల నుంచి సీటు సాధించాలంటే ఆర్థికంగా బలంగా ఉండాల్సిందే. ఫైనాన్సియల్‌ గా ఫిట్‌ గా ఉంటేనే సీటు కన్ఫామ్‌ అయ్యే అవకాశాలు మరింత మెరుగవుతాయి.
 
చిత్తూరు జిల్లాలో ఇప్పుడు అధికార - ప్రతిపక్ష పార్టీల నేతలు ఆర్థిక అండదండల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో దడ పుట్టుకుంది.  మరోసారి పోటీ చేసేందుకు టికెట్‌ ఆశిస్తున్నారు. ఫైనాన్సియల్‌ కోణంగా టిక్కెట్‌ కేటాయింపు ఉన్నట్లయితే తమకు ఢోకా లేదని ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.

అయితే గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నారాయణస్వామికి ఆర్థిక భయం పట్టుకుంది. ఈ స్థానం నుంచి మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న ఇక్కడ ఫైనాన్సియల్‌ గా బలంగా ఉన్నవారికే టిక్కెట్‌ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో తమకు టికెట్‌ వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నాడు. అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌ - మదనపల్లె - పీలేరు ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి - దేశాయి దిగ్బారెడ్డి ఎమ్మెల్యేల్లోనూ ఇదే టెన్షన్‌ మొదలైనట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో ఎవరికి టిక్కెట్‌ ఇవ్వాలనే విషయంలో కుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించనున్నారు.  ఆయన నిర్ణయించినవారికే టిక్కెట్‌ దక్కుతుందని కొందరు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి దగ్గర మార్కులు కొట్టేందుకు ఆయనను కలుస్తూ వస్తున్నారు. ఒకవేళ  ఆర్థిక కారణంలోనే టిక్కెట్‌ కేటాయిస్తే మాత్రం తమకు టికెట్లు రావని ఆర్థికంగా లేని ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. .


Tags:    

Similar News