భారత అమ్ముల పొదిలో నాగాస్త్రం...తుది దశ ప్రయోగం సక్సెస్ !

Update: 2020-10-23 06:50 GMT
భారత  దేశ రక్షణ వ్యవస్థను మరింతగా  బలోపేతం చేస్తూ భారత్‌ మరో క్షిపణి ప్రయోగంలో విజయం సాధించింది. మూడవ తరం యాంటీ-ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణి ‘నాగ్‌ ను గురువారం ఉదయం 6.45 గంటలకు రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ(డీఆర్ ‌డీఓ) విజయవంతంగా పరీక్షించింది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ట్యాంకు విధ్వంసక క్షిపణి. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఎడారిలో నాగ్‌ క్షిపణి క్యారియర్‌ ‘నామికా’ ద్వారా ఈ ప్రయోగం చేశారు.

కేవలం సెకన్ల వ్యవధిలోనే లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని వివరించింది. 4 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులను సైతం, ఏ సమయంలోనైనా నాశనం చేసేలా ఆ క్షిపణిని అభివృద్ధి చేశారు. ఈ క్షిపణి క్యారియర్ ‌ని రష్యాకు చెందిన బీఎంపీ–2 పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఈ తరహా పరిజ్ఞానం లాక్‌ బిఫోర్‌ లాంచ్‌ వ్యవస్థని కలిగి ఉంటుంది. అంటే క్షిపణిని ప్రయోగించడానికి ముందే లక్ష్యాలను గుర్తిస్తారు. దీన్ని ఉపరితలం లేదా గగనతలం నుంచి కూడా ప్రయోగించే అవకాశం ఉండటం విశేషం.  గురువారం నాటి తుది పరీక్ష విజయవంతమైన నేపథ్యంలో నాగ్‌ క్షిపణి ఇక ఉత్పత్తి దశకు చేరుకుంది. క్షిపణిని ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌), నామికాను మెదక్ ‌లోని ఆర్డ్ ‌నెన్స్‌ పరిశ్రమ ఉత్పత్తి చేయనున్నాయి అని డీఆర్ ‌డీఓ స్పష్టం చేసింది.

గత కొన్ని రోజులుగా భారత్, చైనా మధ్య సరిహద్దు వద్ద వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ సమయంలో కేంద్రం క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసింది. తుది దశ ప్రయోగం విజయవంతం కావడం పగలు, రాత్రి కూడా క్షిపణి కచ్చితంగా లక్ష్యాలను ఛేదించడంతో ఈ క్షిపణి ఉత్పత్తి దశకు చేరుకుందని డీఆర్ ‌డీఓ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఈ క్షిపణి ఇక భారత అమ్ముల పొదిలోకి చేరడానికి సిద్ధంగా ఉంది. తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో నాగ్‌ క్షిపణిని మోహరించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Tags:    

Similar News