క‌లెక్ట‌రమ్మ‌కు స‌న్మానం చేసిన రైతులు!

Update: 2019-06-29 09:21 GMT
క‌లెక్ట‌ర్లు చాలామంది ఉంటారు. కానీ.. కొంద‌రు క‌లెక్ట‌ర్లు మాత్రం అందుకు భిన్నం. వారు ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో అలా ఉండిపోతారు. నిస్వార్థంతో పని చేసే అధికారులు బ‌దిలీ మీద వెళుతున్న వేళ‌.. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు నిర్వ‌హించ‌టం చూస్తుంటాం. తాజాగా.. త‌మ క‌లెక్ట‌ర్ బ‌దిలీ మీద వెళ్లిపోవ‌టాన్ని ఆ జిల్లా ప్ర‌జ‌లు అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. అంతేనా.. తాను ఏర్పాటు చేసిన స‌మావేశానికి హాజ‌రైన రైతులు ఏకంగా స‌న్మానం చేసిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇంత‌కీ ఇదంతా ఎక్క‌డ చోటు చేసుకుంటుందంటే..

త‌మిళ‌నాడులోని సేలం జిల్లా కలెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు రోహిణీ బాజీ భ‌గారే. జిల్లాకు వ‌చ్చిన తొలి మ‌హిళా క‌లెక్ట‌ర్ గా గుర్తింపు పొందిన ఆమె త‌న నిర్ణ‌యాల‌తో.. పాల‌నా విధానాల‌తో అన‌తికాలంలోనే మంచిపేరును తెచ్చుకున్నారు. తాను జిల్లాకు వ‌చ్చిన వెంట‌నే తొలి స‌మావేశాన్ని రైతుల విన‌తుల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన ఆమె.. తానున్న 20 నెల‌ల వ్య‌వ‌ధిలో వినూత్న కార్య‌క్ర‌మాల ద్వారా సేలం జిల్లాను నిత్యం వార్త‌ల్లో ఉండేలా చేశారు.

రైతులు.. దివ్యాంగులు.. విద్యార్థులు.. మ‌హిళ‌లు.. శిశువులు స‌హా అన్ని వ‌ర్గాల‌కు చెందిన వారికి సంబంధించిన అంశాల విష‌యంలో ఆమె తీసుకున్న నిర్ణ‌యాలు.. అనుస‌రించిన మార్గాల‌తో ఆమె పేరు సంచ‌ల‌నంగా మారింది. సోష‌ల్ మీడియాలో రోహిణీ పేరు మారుమోగింది. రైతుబిడ్డ‌గా ఆమె రైతుల‌కు పెద్ద‌పీట వేసేవారు.

తాజాగా జ‌రిగిన క‌లెక్ట‌ర్ల బ‌దిలీల్లో రోహిణి ఒక‌రు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి రైతులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు రైతులు శాలువాలు క‌ప్పి స‌న్మానం చేశారు. సేలం జిల్లాకు తాను వ‌చ్చినప్పుడు తొలుత నిర్వ‌హించిన స‌మావేశం.. చివ‌రి స‌మావేశం రైతుల‌దేన‌ని ఆమె పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కున్న అనుబంధాన్ని చెప్పే క్ర‌మంలో ఆమె భావోద్వేగానికి గురై కంట‌త‌డి పెట్టారు. దీంతో.. ఆ ప్రాంగ‌ణ‌మంతా ఒక్క‌సారిగా మౌనంతో నిండింది.
Tags:    

Similar News