పెద్దపల్లిలో ఘోరం: తహసీల్ ఆఫీస్ ఎదుట రైతు ఆత్మహత్య

Update: 2020-06-20 09:50 GMT
తెలంగాణ లో ఇంకా రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానంతో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి విసుగుచెంది ఆగ్రహం.. ఆవేదనతో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలోనే గతంలో తహసీల్దార్ ను కార్యాలయంలోనే దహనం చేసిన ఘటన తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇలాంటి సమస్య ఉంటే రైతు కార్యాలయం ఎదుటనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు మందల రాజిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న ఎకరం 20 గుంటల భూమి అధికారులు తన పేరిట ఆన్‌లైన్ చేయాలంటూ పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పెట్టుకున్నాడు. ఈ విషయమై ఎన్నిసార్లు తిరిగినా అధికారుల నుంచి సరైన సమాధానం ఉండడం లేదు. తన పేరు మీదకు కాకపోవడంతో రైతు బంధు సహాయం కూడా రావడం లేదు. దీంతో ఆయన కలత చెందాడు.
Read more!

ఇదే ఆవేదనతో కాల్వశ్రీరాంపూర్ మండల తహసీల్దార్ కార్యాలయానికి శనివారం రాజిరెడ్డి వచ్చాడు. కార్యాలయం ఎదురుగా పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అంతకుముందు రైతు రాజిరెడ్డి సూసైడ్ నోట్ రాశాడు. ఆ లేఖలో తన మృతికి ఎమ్మార్వో వేణుగోపాల్, వీఆర్వోలు గురుమూర్తి, స్వామి కారణమని ఆరోపించాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. రైతు మృత‌దేహాన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఔ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News