జగన్ నిర్ణయం కోసం ఎదురుచూపులు

Update: 2021-05-10 09:30 GMT
రాజకీయపార్టీల నేతలంతా ఇపుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రతను అదుపుచేయటంలో తమ సలహాలు ఇవ్వాలంటు ప్రతిపక్షనేతలు ప్రభుత్వాన్ని డిమాండ్లు చేస్తున్నారు. ఇందుకోసం వెంటనే జగన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కూడా గట్టిగా కోరుతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా తేవ్రతను అదుపుచేయటానికి ప్రభుత్వం చేతిలో ఉన్న చర్యలను దాదాపు తీసుకున్నది. అయితే టీకాలు, ఆక్సిజన్ అన్నది కేంద్రప్రభుత్వ నియంత్రణలో ఉంది కాబట్టి రాష్ట్రప్రభుత్వం చేయగలిగేదేమీలేదు. ఇదే సమయంలో కొన్ని జిల్లాల్లో తక్కువ పరిణామమే అయినా ఆక్సిజన్ ఉత్పత్తికి అవసరమైన ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలను తీసుకుంది.

ప్రతిపక్షాలు డిమాండ్లు చేస్తున్నట్లు బెడ్లసంఖ్యను పెంచటం, వైద్య సౌకర్యాలను మెరుగుపరచటం లాంటి చర్యలను ఇప్పటికే తీసుకుంది. ఎక్కడక్కడ ఎన్ని బెడ్లున్నాయనే విషయాన్ని ప్రభుత్వమే రోజువారి లెక్కలందిస్తోంది. ఇలాంటి సమయంలో అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతిపక్షాల్లో ఏదికూడా ఇప్పటివరకు ఆచరణాత్మకమైన సూచనలు ఇచ్చిందిలేదు. ఎంతసేపు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నిస్తున్నాయి.

ఎంతసేపు టీకాలు వేయటంలేదు, ఆక్సిజన్ అందించటం లేదని అంటున్న చంద్రబాబునాయుడు అండ్ కో దానికి కారణమైన కేంద్రప్రభుత్వాన్ని మాత్రం నిలదీయటం లేదు. కేంద్రం తప్పిదాలను కూడా కావాలనే జగన్ ఖాతాలో వేసి నానా గోలచేస్తున్నారు. ఇక వామపక్షాలు, బీజేపీ కూడా ఇదే పద్దతిలో నానా యాగీచేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం అఖిలపక్షం పెడుతుందని అనుకోవటంలేదు. ఎందుకంటే ఇప్పటివరకు విడివిడిగా చేస్తున్న గోలనే అఖిలపక్షం పెడితే మూకుమ్మడిగా ఒకే వేదికగా చేస్తాయంతే.

ఒకసారి చరిత్రలోకి వెళితే చంద్రబాబు అధికారంలో ఉండగా ఏ సమస్య మీద కూడా అఖిలపక్ష సమావేశం పెట్టలేదు. పోలవరం సమస్య కావచ్చు, ప్రత్యేకహోదా విషయం, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేకరైల్వేజోన్ అంశ మీద కావచ్చు. అఖిలపక్ష సమావేశాన్ని నర్వహించమని అప్పట్లో వైసీపీ+ప్రతిపక్షాలు అడిగితే చంద్రబాబు అవసరం లేదు పొమ్మన్నారు. ‘నిర్ణయాలు తీసుకోవటం తనకు చేతకాకపోతేనే కదా అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సింది’ అని స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి ఇపుడు జగన్ కూడా అదేదారిలో నడుస్తున్నారు.
Tags:    

Similar News