గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు? ఎప్పటి నుంచి అంటే..

కూటమి ప్రభుత్వం 2027 లో నిర్వహించే గోదావరి పుష్కరాల తేదీలు ప్రకటించింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నారు.;

Update: 2025-12-13 12:33 GMT

కూటమి ప్రభుత్వం 2027 లో నిర్వహించే గోదావరి పుష్కరాల తేదీలు ప్రకటించింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నారు. 12 రోజులపాటు గోదావరి పుష్కరాలు కొనసాగనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. టిటిడి ఆస్థాన సిద్ధాంతి అభిప్రాయం మేరకు గోదావరి పుష్కరాల తేదీలు ప్రకటించారు. విజయవాడ ఎండోమెంట్స్ కమిషనర్ ప్రతిపాదనలను ఆమోదించి ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది. గోదావరి పుష్కరాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను కూడా జారీచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో మూడోసారి గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు రెండుసార్లు ఆయన సారథ్యంలోనే పుష్కరాలు జరిగాయి.

తెలంగాణ ఏర్పాటు అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ కి చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగానే గోదావరి పుష్కరాలు 2015 ఏడాది జులై 14 నుంచి జులై 25 వరకు జరిగాయి. అప్పట్లో 5.20 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. అల్లూరి, ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాలు, కోనసీమ జిల్లాల్లో గోదావరి నది ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నదీస్నానం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.13 రాష్ట్ర శాఖలతో పాటుగా రైల్వేశాఖ కలిపి మొత్తం 14 శాఖలు పుష్కరాల ఏర్పాట్లలో పాల్గొంటాయి. ఈ సారి భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకోసం కుంభమేళా స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.

గోదావరి ఏపీలో అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల పరిధిలో ప్రవహిస్తుంది. గత పుష్కరాల్లో 202 ఘాట్లు ఏర్పాట్లు చేశారు. ఇందులో కుడివైపు 127, ఎడమవైపు 75 ఘాట్లు ఉన్నాయి. ఈసారి మరిన్ని ఘాట్లు పెంచాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం రోజుకు 75 లక్షల యాత్రికులు పుష్కరాలలో స్నానం చేస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం నుంచి కాతేరు వరకూ 17 ఘాట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా అవసరాలకు అనుగుణంగా వీటిని విస్తరించాలని భావిస్తున్నారు. అందుకోసం మూడు విభాగాలుగా ఘాట్లను పెంచుతున్నారు.

ఇక పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తు చేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ లను ప్రత్యేకాధికారులుగా నియమించారు. పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం దేవాదాయ శాఖకు రూ.2,105 కోట్లు విడుదల చేసింది.

Tags:    

Similar News