తైవాన్ విషయంలో జపాన్ తీవ్ర హెచ్చరిక.. చైనా స్పందన ఇదే..
కొత్త ప్రధాని సనాయ్ తకాయిచీ చేసిన వ్యాఖ్యలు చైనా–జపాన్ సంబంధాల్లో ఉద్రిక్తతను మరింత పెంచాయి.;
ఆసియా రాజకీయాల్లో నిశ్శబ్దం ఒక్కసారిగా చీలిపోయింది. సాధారణంగా మాటలకే పరిమితమయ్యే జపాన్ ఈసారి స్పష్టంగా, ఘాటుగా మాట్లాడింది. తైవాన్‌పై దాడి జరిగితే ఊరుకునేది లేదని, జపాన్ నేరుగా జోక్యం చేసుకుంటుందని ప్రకటించడం ఆసియా భౌగోళిక రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు; రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రక్షణాత్మక ధోరణికే పరిమితమైన జపాన్ తన పాత్రను తిరిగి నిర్వచించుకుంటున్న సంకేతం.
జపాన్ ప్రధాని హెచ్చరిక..
కొత్త ప్రధాని సనాయ్ తకాయిచీ చేసిన వ్యాఖ్యలు చైనా–జపాన్ సంబంధాల్లో ఉద్రిక్తతను మరింత పెంచాయి. “తైవాన్‌పై దాడి అంటే అది జపాన్ భద్రతపై నేరుగా దాడి చేసినట్టే” అనే మాటలు, ఇప్పటివరకు వినిపించిన దౌత్య భాషకన్నా భిన్నంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యల వెనుక జపాన్‌లో మారుతున్న భద్రతా ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. జపాన్ ఆందోళనకు ప్రధాన కారణం తైవాన్ మాత్రమే కాదు. తూర్పు చైనా సముద్రంలో ఉన్న సెంకాకు ద్వీపాలు చుట్టూ చైనా నౌకల కదలికలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి. ఈ ద్వీపాలను జపాన్ పరిపాలిస్తుండగా, వాటిపై చైనా కూడా హక్కులు చెబుతోంది. దాదాపు ప్రతివారం చైనా కోస్ట్ గార్డ్ నౌకలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం జపాన్‌లో ఆందోళనను మరింత పెంచింది. తైవాన్‌పై దాడి జరిగితే, అదే సమయంలో సెంకాకు ప్రాంతంలో కూడా చైనా దూకుడు పెరిగే అవకాశం ఉందని టోక్యో భావిస్తోంది.
తైవాన్ అంశం ఆసియాలో అత్యంత సున్నితమైనది. తైవాన్ ను చైనా తన భూభాగంలో భాగంగా చూస్తోంది. అవసరమైతే బలవంతంగా విలీనం చేస్తామన్న హెచ్చరికలు కూడా పలుమార్లు చేసింది. అయితే జపాన్‌కు తైవాన్ భౌగోళికంగా చాలా దగ్గర. తైవాన్ సముద్ర మార్గాలు జపాన్ ఇంధన సరఫరాకు కీలకం. అక్కడ అస్థిరత ఏర్పడితే, జపాన్ ఆర్థిక వ్యవస్థకే పెద్ద దెబ్బ పడుతుంది. అందుకే తైవాన్ భద్రతను జపాన్ తన జాతీయ భద్రతలో భాగంగా చూస్తోంది. సనాయ్ తకాయిచీ వ్యాఖ్యలు యాదృచ్ఛికం కావు. గత కొన్నేళ్లుగా జపాన్ రక్షణ విధానంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రక్షణ బడ్జెట్ పెంపు, దీర్ఘ శ్రేణి క్షిపణుల కొనుగోలు, అమెరికాతో మరింత బలమైన సైనిక సహకారం.. ఇవన్నీ జపాన్ ఇక కేవలం ‘రక్షణాత్మక దేశం’గా ఉండదన్న సంకేతాలు. చైనా పెరుగుతున్నా సైనిక శక్తికి సమతుల్యం అవసరమని జపాన్ పాలకవర్గం భావిస్తోంది.
అమెరికాకు ఊరట..
ఈ హెచ్చరిక ఆసియా మొత్తానికి సందేశం ఇస్తోంది. ఒకప్పుడు ఆర్థిక శక్తిగా మాత్రమే కనిపించిన జపాన్ ఇప్పుడు భద్రతా రాజకీయాల్లో కూడా ముందడుగు వేస్తోంది. ఇది అమెరికాకు కూడా ఊరట కలిగించే పరిణామమే. ఎందుకంటే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాను నియంత్రించేందుకు అమెరికా జపాన్‌ను కీలక భాగస్వామిగా చూస్తోంది. తైవాన్ విషయంలో జపాన్ స్పష్టత చూపడం వాషింగ్టన్ వ్యూహానికి బలం చేకూరుస్తోంది. అయితే ఈ పరిణామాలు ప్రమాదాలను కూడా పెంచుతాయి. జపాన్–చైనా మధ్య ఉద్రిక్తత పెరిగితే అది మొత్తం ఆసియాను అస్థిరత వైపు నెట్టే అవకాశం ఉంది. చిన్న పొరపాటు కూడా పెద్ద సైనిక ఘర్షణగా మారే ప్రమాదం ఉంది. తైవాన్, సెంకాకు, దక్షిణ చైనా సముద్రం—ఈ మూడు ప్రాంతాలు ఇప్పటికే ఉద్రిక్తతలతో మండుతున్నాయి. ఇప్పుడు జపాన్ మరింత గట్టిగా మాట్లాడడం పరిస్థితిని మరింత సున్నితంగా మార్చుతోంది.
ఇప్పటికీ ఒక ప్రశ్న మిగిలే ఉంది. ఇది కేవలం రాజకీయ హెచ్చరికేనా? లేక నిజంగా జపాన్ అవసరమైతే సైనికంగా ముందుకు వస్తుందా? సనాయ్ తకాయిచీ వ్యాఖ్యలు చూస్తే, జపాన్ ఇక వెనక్కి తగ్గే స్థితిలో లేదన్న భావన కలుగుతోంది. శాంతి రాజ్యాంగం పరిమితుల్లోనే ఉన్నా, తన భద్రతకు ముప్పు వస్తే జపాన్ నిశ్చలంగా ఉండదని ఈ హెచ్చరిక స్పష్టం చేస్తోంది. ఆసియా రాజకీయాల్లో ఇది కొత్త అధ్యాయం. నిద్రలేచిన జపాన్ ఆసియా సింహంలా తన ఉనికిని చాటుతోంది. ఇకపై తైవాన్ చుట్టూ జరిగే ప్రతి కదలిక, సెంకాకు సముద్రంలో కనిపించే ప్రతి నౌక కదిలికను మరింత జాగ్రత్తగా గమనించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక చిన్న ఘటన కూడా ఈసారి పెద్ద అగ్నిపర్వతాన్ని మేల్కొలిపే అవకాశం ఉంది.