స్నేహితురాలి పెంపుడు చిలుకకు సాయం చేస్తూ షాక్ తో మృతి

ఐరెన్ గొట్టానికి ముందు కట్టెను కట్టి.. అపార్టు మెంట్ ప్రహరీపై నిలబడి చిలుకను విద్యుత్ తీగను వదిలి పైకి ఎగిరేందుకు ప్రయత్నించాడు.;

Update: 2025-12-13 11:30 GMT

సాయం చేయటం తప్పు కాదు. కానీ.. ఆ క్రమంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్నపాటి ఏమరుపాటుతో ప్రాణాలు పోతాయన్న విషయం తాజా విషాద ఉదంతాన్ని చూస్తే అర్థమవుతుంది. సాయం చేసేందుకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడి ఉదంతంగా దీన్ని చెప్పాలి. బెంగళూరు నగరంలో చోటు చేసుకున్న ఈ విషాద ఉదంతం గురించి తెలిసిన వారంతా.. షాక్ తినే పరిస్థితి.

బెంగళూరుకు చెందిన లిఖిత అనే యువతి తన ఫ్లాట్లో విదేశీ చిలుకను పెంచుకుంటోంది. అదికాస్తా కిటికీ నుంచి ఎగిరి పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగపై కూర్చుంది. దీంతో.. సాయం కోసం స్నేహితుడు.. బంధువు అయిన 32 ఏళ్ల అరుణ్ కుమార్ సాయాన్ని కోరింది. దీంతో లిఖిత పెంపుడు చిలుకను కాపాడేందుకు రంగంలోకి దిగాడు. అయితే.. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించటంలో ఫెయిల్ అయ్యాడు.

ఐరెన్ గొట్టానికి ముందు కట్టెను కట్టి.. అపార్టు మెంట్ ప్రహరీపై నిలబడి చిలుకను విద్యుత్ తీగను వదిలి పైకి ఎగిరేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇనుప గొట్టం 66 వేల కిలోవాట్ తీగకు తాకటంతో అరుణ్ కుమార్ విద్యుత్ షాక్ కు గురై.. అక్కడికక్కడే మరణించాడు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామానికి లిఖిత షాక్ తింది.

ఈ విషాద ఉదంతం గురించి సమాచారం అందుకున్నంతనే పోలీసులు.. విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిజానికి హైటెన్షన్ తీగల్ని తొలగించాలని స్థానికులు ఎప్పటి నుంచో కోరుతున్నా.. అధికారులు స్పందించలేదని.. అదిప్పుడు ఒకరి ప్రాణాల్ని తీసిందంటూ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాయం కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఈ ఉదంతం అందరిని కదిలిస్తోంది.

Tags:    

Similar News