ఆ ఐఏఎస్ ఆఫీసర్ పై లక్ష్మినారాయణ చేయి చేసుకున్నాడా?

Update: 2019-04-17 10:31 GMT
సీబీఐ ఏపీ విభాగం డీజీగా వ్యవహరించడం ద్వారా చాలా గుర్తింపునే పొందారు లక్ష్మినారాయణ. ఆ గుర్తింపుతోనే ఆయన అర్దాంతరంగా ఉద్యోగాన్ని సైతం వదులుకుని వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారనే విషయం తెలిసిందే. సీబీఐ విచారణాధికారిగా వచ్చిన గుర్తింపే ఆయన రాజకీయ ఎంట్రీకి కారణం అయ్యింది.

రాజకీయాల్లోకి రావడానికి ఉద్యోగాన్ని వదలుకుని, కొన్ని రోజుల పాటు మొత్తం వ్యవహారాలను పరిశీలించి తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారనే వార్తల్లోకి వచ్చారు లక్ష్మినారాయణ. టీడీపీలో చేరి ఆయన భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే మాట వినిపించింది. అయితే ఆ లీక్ వచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన తెలుగుదేశం లోకి చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు.

చివరకు జనసేనలోకి చేరి ఎంపీ టికెట్ ను పొందారు. విశాఖ నుంచి లక్ష్మినారాయణ ఎంపీగా పోటీ చేశారు. మరి ఆయన గెలుస్తారా - ఓడతారా.. అనేది ఫలితాలు వస్తే కాని తెలియని అంశం.

ఆ సంగతలా ఉంటే.. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో లక్ష్మినారాయణ గురించి బీజేపీ నేత రఘురాం ఒక ఆసక్తిదాయకమైన వ్యాఖ్యను చేశారు. గతంలో సీబీఐ  జేడీగా ఉన్నప్పుడు ఏపీకి సంబంధించి కీలకమైన కేసులను విచారించిన లక్ష్మినారాయణ.. విచారణ సందర్భంగా ఒక ఐఏఎస్ అధికారిపై చేయి చేసుకున్నారని రఘురాం అన్నారు.

అలా లక్ష్మినారాయణ చేత భౌతిక దాడిని ఎదుర్కొన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి  అని ఆయన చెప్పుకొచ్చారు. అప్పట్లో లక్ష్మినారాయణ వివిధ కేసుల్లో చాలా మంది ఐఏఎస్ ల మీద కేసులో నమోదు చేసిన సంగతి తెలిసిందే. వారిలో కొందరు ఆ కేసులను కోర్టుల్లో కొట్టేయించుకుని తర్వాత విధుల్లో చేరిపోయారు. ఆ సందర్భంగా విచారణలో భాగంగా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మిని లక్ష్మినారాయణ కొట్టారని రఘురాం చెప్పారు.

విచారణలో భాగంగానే అయినప్పటికీ ఒక సాటి ఐఏఎస్ మీద లక్ష్మినారాయణ చేయి చేసుకుని ఉంటారా? అనేది మాత్రం బయటి వాళ్లకు తెలిసే అంశం కాదు. బీజేపీ నేత మాత్రం కొన్ని వర్గాల ద్వారా ఆ సమాచారం తెలిసిందని అన్నారు. మరి ఈ వ్యవహారంపై లక్ష్మినారాయణ స్పందిస్తారా?
Tags:    

Similar News