బీజేపీ ముఖ్యమంత్రి ఈటెల... ?

Update: 2021-11-03 13:30 GMT
జనంలో ఫోకస్ అయిన వారు, పేరున్న వారే నాయకుడుగా ఉంటారు. వారినే జనం ఆదరిస్తారు. బీజేపీకి తెలంగాణాలో ఎపుడూ నాయకత్వం కొదవ లేదు. టైగర్ ఆలె నరేంద్ర నుంచి మొదలుపెడితే బద్ధం బాలిరెడ్డి బంగారు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, సీహెచ్ విద్యాసాగరరావు, జి కిషన్ రెడ్డి ఇలా చాలా పెద్ద లిస్ట్ బీజేపీకి ఉంది. వీరంతా గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వచ్చి కమలం పార్టీకి కాంతులు అద్దిన వారు. అలాంటి బీజేపీలో నవతరం కూడా వేగంగానే నిర్మాణం అవుతోంది. బండి సంజయ్ ఇపుడు తెలంగాణా బీజేపీ బండిని జోరుగా నడుపుతున్నారు. ఆయన వచ్చాకనే  కొత్త షేపూ రూపూ పార్టీకి వచ్చింది అని అంతా ఒప్పుకుంటారు.

మరో వైపు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కూడా తనదైన తీరులో బీజేపీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు తెలంగాణా బీజేపీలో మరో బీసీ నేతగా అవతరించారు. ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టారు. అది బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఎంతలా ఆకర్షించింది అంటే ఎక్కడో ఇటలీలో ఉన్న ప్రధాని మోడీ స్వయంగా బీజేపీ నేతలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇక అమిత్ షా అయితే తరచూ ఫోన్ చేస్తూ అప్ డేట్స్ తెలుసుకున్నారు. తెలంగాణా మీద బీజేపీ పెద్దలకు ఏనాటి నుంచో మనసు ఉంది.

అయితే పరిస్థితులు కలసిరాక ఇన్నాళ్ళూ బండి జోరెత్తలేదు. ఇపుడు దుబ్బాక తరువాత కేవలం ఏడాది వ్యవధిలోనే మరో భారీ విక్టరీ లభించింది. అది కూడా ఈటెల రాజెందర్ ద్వారా. ఆయన మామూలు నాయకుడు కాదు, ఉద్యమ నేత. అంతే కాదు, మంత్రిగా పనిచేసిన మనిషి. ఇక కేసేయార్ కి కుడి భుజం లాంటి నాయకుడు. అలాంటి నేత ఇపుడు బీజేపీ చేతిలో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా నెగ్గినా అంతకు మించి ఆయనకు మర్యాదా గౌరవం బీజేపీ నేతల నుంచి లభిస్తాయనడంలో సందేహం లేదు.

ఈటెల తొందరలోనే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాని కలుస్తారు అంటున్నారు. రేపటి తెలంగాణా బీజేపీలో ఈటెల రోల్ సామాన్యంగా ఉండబోదు. ఆయన్ని ముందు పెట్టి కాషాయ దళం కధను మొత్తం నడిపించడం ఖాయం. ఇక టీయారెస్ గుట్టు మట్లు అన్నీ తెలిసిన ఈటెలను ఫుల్ గా వాడేసుకుని ఆయన‌తోనే గులాబీ కోటను కూల్చాలన్న బీజేపీ ఎత్తుగడ పారాలి అంటే ఈటెలను తెలంగాణా బీజేపీలో అగ్ర భాగాన నిలపాలి.  అలా కనుక చూస్తే ఇప్ప‌టిదాకా బీసీ కార్డుతో దూకుడు చేస్తున్న బండి సంజయ్ కంటే కూడా ఈటెల జోరు మించడం ఖాయమనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఇది మరికాస్తా ముందుకెళ్ళి ఈటెలను బీజేపీ సీఎం అభ్యర్ధిగా కూడా ప్రమోట్ చేసినా చేయవచ్చు అంటున్నారు. మొత్తానికి ఈటెల గులాబీ దళానికి ఈటె ముల్లులా మారాలీ అంటే బీజేపీలో ఆయన పొజిషన్ కూడా ఇంకా ఎన్నో ఎత్తులకు చేరాలి. ఆ వ్యూహమే అమలు చేయడానికి బీజేపీ అధినాయకత్వం రెడీగా ఉందని అంటున్నారు.
Tags:    

Similar News