రాష్ట్రంలో పీసీఏ ఏర్పాటు.. ఛైర్మన్‌ గా ఆయనకే బాధ్యతలు

Update: 2021-07-09 09:37 GMT
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోలీసు ఫిర్యాదుల అథారిటీకి పలువురు అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి. అదనపు ఎస్పీ, అంతకంటే పై స్థాయి పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదులని ఈ అథారిటీ విచారణ చేస్తుంది. తీవ్రమైన దుష్ప్రవర్తన, పోలీసు కస్టడీలో మృతి, దాడి, అత్యాచారం వంటి ఘటనలు జరిగిన సందర్భంలో వాటికి సంబంధించిన ఫిర్యాదుల విచారణకు ఈ  అథారిటీని ఏర్పాటు చేశారు.  పీసీఏలో రిటైర్డ్‌ ఐఏఎస్‌, రిటైర్డ్‌ ఐపీఎస్‌ తో పాటు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి సభ్యులుగా ఉంటారు. తమకు వచ్చిన ఫిర్యాదులను పీసీఏ విచారించి.. అందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ఏపీ ప్రభుత్వం పోలీసు ఫిర్యాదుల అథారిటీకి ముగ్గురు సభ్యులను నియమించింది. విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కేవీవీ గోపాలరావు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బి.కిశోర్‌, ఉదయలక్ష్మి సభ్యులుగా నియామకమయ్యారు. 63 ఏళ్లు లేదా 65 ఏళ్లు వయసు వచ్చేవరకు కాలపరిమితి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇప్పటికే ప్రభుత్వం పోలీసు ఫిర్యాదుల అథారిటీ ఛైర్మన్‌ గా మద్రాస్‌ హైకోర్ట్‌ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.కనగరాజ్‌ ను నియమించిన విషయం తెలిసిందే. గతేడాది ఎస్‌ఈసీ బాధ్యతల నుంచి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తప్పించి జస్టిస్ కనగరాజ్‌‌ను ప్రభుత్వం నియమించింది. అయితే, హైకోర్టు ఆదేశాలతో ఆయన ఎస్ఈసీ పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక జిల్లా స్థాయిలో ఛైర్మన్‌ లు, సభ్యులను నియమించింది. 3 జిల్లాలకు ఒక ఛైర్మన్‌, ఇద్దరు సభ్యులను నియమించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు ఛైర్మన్‌ గా వరప్రసాదరావు, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు ఛైర్మన్‌గా విశ్రాంత జిల్లా జడ్జి ఆర్‌ జే విశ్వనాథం, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఛైర్మన్‌ గా నేతల రమేశ్‌బాబు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతరం జిల్లాలకు ఛైర్మన్‌ గా వెంకటరమణారెడ్డి నియమితులయ్యారు. జిల్లాల కమిటీ సభ్యులుగా విశ్రాంత విశ్రాంత కలెక్టర్‌ లు, డీఎస్పీలను నియమించింది.

ఇదిలా ఉంటే .. తెలంగాణ ప్రభుత్వం కూడా పోలీసు ఫిర్యాదుల అథారిటీ సభ్యులను నియమించింది. రిటైర్డ్‌ జస్టిస్‌ విలాస్‌ వీ అఫ్జల్‌ పూర్కర్‌ ను అథారిటీ చైర్మన్‌ గా  నియమిస్తూ హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రస్థాయి కమిటీ సభ్యులుగా రిటైర్డ్‌ ఐపీఎస్‌ నవీన్‌ చంద్‌, సభ్య కార్యదర్శిగా శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ వ్యవహరిస్తారని జీవోలో పేర్కొన్నారు. అదే విధంగా రెండు జిల్లా పోలీస్‌ ఫిర్యాదుల అథారిటీలను కూడా ఏర్పాటు చేశారు. వీటిలో హైదరాబాద్‌ రీజియన్‌ అథారిటీకి చైర్మన్‌ గా రిటైర్డ్‌ జిల్లా జడ్జి కే సంగారెడ్డిని నియమించారు. సభ్యుడిగా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏ వెంకటేశ్వర్‌ రావు, సభ్య కార్యదర్శిగా వెస్ట్‌ జోన్‌ ఐజీని నియమించారు. వరంగల్‌ రీజియన్‌ జిల్లా పోలీస్‌ ఫిర్యాదుల అథారిటీ చైర్మన్‌ గా రిటైర్డ్‌ జిల్లా జడ్జి ఎం వెంకటరమణరావు, సభ్యుడిగా రిటైర్డ్‌ అడిషనల్‌ కమిషనర్‌ జే లక్ష్మీనారాయణ, సభ్యకార్యదర్శిగా నార్త్‌ జోన్‌ ఐజీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.  తమకు వచ్చిన ఫిర్యాదులను పీసీఏ విచారించి.. అందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. పీసీఏ సిఫారసులను కచ్చితంగా అమలు చేయాలా? వద్దా? అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

పోలీసులు న్యాయం చేయకపోయినా, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోయిన, సకాలంలో న్యాయం లభించక పోయినా ప్రజలు పీసీఏను ఆశ్రయించవచ్చు. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది. దీంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అథారిటీలు ఏర్పాటయ్యాయి.
Tags:    

Similar News