ట్రంప్ కంపు... భారత్ మురికిమయమట!!

Update: 2020-10-24 02:30 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిలకడలేని తనాన్ని మరోమారు బయటపెట్టుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ తో మూడో ముఖాముఖి సందర్భంగా ట్రంప్ నోటి దురుసు ప్రదర్శించారు. భారత్ మురికిమయమైనదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్... అధ్యక్ష బరిలోకి దిగిన తర్వాత వరుసగా రెండో సారి భారత్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయుల ఓట్లు కీలకని భావిస్తున్న తరుణంలో ట్రంప్ నోట నుంచి ఈ తరహా కామెంట్లు రావడం పెను సంచలనంగా మారిపోయింది. భారత్ కు వ్యతిరేకంగా, భారత ప్రతిష్ఠను కించపరిచేలా ట్రంప్ చేస్తున్న వరుస కామెంట్లు ఆయనకు ప్రవాస భారతీయులను మరింత దూరం చేస్తున్నాయన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ తో మూడో దఫా బహిరంగ చర్చ సందర్భంగా కాలుష్యం, దాని నివారణకు అమెరికా చేస్తున్న ఖర్చు తదితర అంశాలను ప్రస్తావించిన ట్రంప్... భారత్ ను మురికి దేశంగా అభివర్ణించారు. పనిలో పనిగా చైనాపై తనకున్న అక్కసును కూడా ట్రంప్ మరోమారు బయటపెట్టుకున్నారు. ఈ సందర్భంగా అసలు ట్రంప్ ఏమన్నారన్న విషఁయానికి వస్తే... ‘‘ప్రపంచంలోని పెద్ద దేశాలు భారీ ఎత్తున కాలుష్యాన్ని వెదజల్లుతోంటే... దాని నివారణ కోసం అయ్యే ఖర్చును అమెరికా భరించాలా? ఆ మధ్య నేను ఇండియా వెళ్లాను. అక్కడి గాలి మురికిమయం. చైనాలోనూ అంతే. వాళ్ల తప్పిదాలను మనం మూల్యం చెల్లించాలా?’’ అని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత్ పట్ల తన మనసులో దాచుకున్న ద్వేషాన్ని ట్రంప్ బయటపెట్టడం ఇదే మొదటి సారేమీ కాదు. జో బైడెన్ తో తొలిసారి జరిగిన ముఖాముఖీ సందర్భంగా కూడా ట్రంప్ భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాలను వణికించేస్తున్న కరోనా మహమ్మారి గురించిన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు... భారత్ లో జరుగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షలపై తనకు అనుమానాలున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అప్పుడే భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వ్యాఖ్యలను అక్కడి మన ప్రసావ భారతీయులు మరిచిపోకముందే.. మరోమారు భారత్ మురికిమయమైనదని ట్రంప్ వ్యాఖ్యానించడం నిజంగానే సంచలనమనే చెప్పాలి. ఈ తరహా వ్యాఖ్యలతో ట్రంప్ కు ప్రవాస భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం లేకపోలేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News