వర్గీకరణ ఉద్యమాన్ని రాజేసిన ప్రత్తిపాటి

Update: 2016-02-13 10:19 GMT
ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీ నేతల్లోనే తీవ్రమైన ఆగ్రహం కలిగిస్తున్నాయి. అంతేకాదు... ఇప్పటికే కులపోరుతో నానా పాట్లు పడుతున్న టీడీపీ ప్రభుత్వానికి మరో ఇబ్బంది తెచ్చేలా కనిపిస్తున్నాయి.

ఏపీ ప్రభుత్వానికి ఎస్సీలను వర్గీకరించే ఆలోచన లేదని ప్రత్తిపాటి చెప్పడంతో ఆ పార్టీకే చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ప్రత్తిపాటి తెలిసీ తెలియని వ్యాఖ్యలు చేయడం మానేసి తెలుసుకున్నాకే మాట్టాడడం నేర్చుకోవాలంటూ ఆయన తీవ్రస్తాయిలో మండిపడ్డారు. సున్నితమైన అంశాలపై వ్యాఖ్యలు చేయడానికి ముందు తెలుసుకుని మాట్లాడడం మంచి పద్దతంటూ ఆయన కాస్త గట్టిగానే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అసలు ఎస్సీల వర్గీకరణ అంశం చాలా చిన్నదని... తనకు అప్పగిస్తే 24 గంటల్లో ఆ పని పూర్తిచేస్తానని డొక్కా అన్నారు. ప్రత్తిపాటి వ్యాఖ్యల నేపథ్యంలో మంద కృష్ణ - ఇతర మాదిగ నేతలతో సమావేశమై ఏం చేయాలో నిర్ణయిస్తానని డొక్కా అంటున్నారు.

కాగా ప్రత్తిపాటి వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు చేస్తున్నారు. మంత్రి క్షమాపణ చెప్పకుండా టవర్ పైనుంచి దూకేస్తానంటూ ఓ వ్యక్తి గొడవ చేయడంతో పోలీసులు వచ్చి ఆయన్ను కిందకు దించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత అయిన డొక్కా కూడా మంద కృష్ణమాదిగ వంటివారితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పడంతో ఇప్పుడు మళ్లీ వర్గీకరణ ఉద్యమం రాజుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News