ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప‌దిమంది కార్య‌క‌ర్త‌లు కూడా లేరా? ఏంద‌ప్పా ఇది?!

Update: 2021-07-06 07:32 GMT
ప్ర‌శ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చుట్టూ.. అనేక ప్ర‌శ్న‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప‌ట్టుమ‌ని పది మంది కార్య‌క‌ర్త‌ల‌ను కూడా ఆయ‌న త‌యారు చేసుకోలేక పోయార‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధాన పార్టీల‌కు దీటుగా తాను రాజ‌కీయం చేస్తాన‌ని.. స‌మాజంలోని బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల త‌ర‌ఫున గ‌ళంవినిపిస్తాన‌ని.. ప్ర‌శ్నించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే ప‌వ‌న్‌.. పార్టీ పెట్టి దాదాపు ప‌దేళ్లు అవుతోంది. 2014 ఎన్నిక‌ల‌కు ముందు జ‌నం కోస‌మే అంటూ.. జ‌న‌సేన పార్టీని ఏర్పాటు చేశారు ప‌వ‌న్‌.

అయితే.. పార్టీ పెట్టిన కొద్ది కాలంలో ఎన్నిక‌లు వ‌చ్చినా.. పోటీకి దూరంగా ఉండిపోయి.. టీడీపీ, బీజేపీల కూట‌మికి మ‌ద్ద‌తిచ్చి ప్ర‌చారం చేశారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ సినిమాల‌కు ప‌రిమిత‌మ‌య్యారు. అడ‌పాద‌డ‌పా.. మీడియా ముందుకు రావ‌డ‌మో.. లేక ప్ర‌జ‌ల మ‌ద్య‌కు వ‌చ్చి.. హ‌ల్‌చ‌ల్ చేయ‌డ‌మో.. త‌ప్ప‌.. పార్టీని పూర్తిస్థాయిలో ప‌ట్టించుకుని ముందుకు న‌డిపించే వ్యూహం ప‌వ‌న్‌లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. నిజానికి ఏపీలో కీల‌క నేత అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌. ఈ గ్యాప్‌ను ప‌వ‌న్ ఫుల్ ఫిల్ చేస్తార‌ని అప్ప‌ట్లో అంద‌రూ అనుకున్నారు.

కానీ, ప‌వ‌న్ వ్య‌వ‌హారం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. లేస్తే.. మ‌నిషిని కాదు.. తాట తీస్తా! అంటూ.. రాజ‌కీయాల్లోనూ సినిమా స్ట‌యిల్ డైలాగులు పేల్చే ప‌వ‌న్‌కు జ‌నాల్లో పెద్ద‌గా ఫాలోయింగ్ క‌నిపించ‌ని మాట వాస్త‌వం. అయితే.. ఆయ‌న ఎక్క‌డ స‌భ పెట్టినా.. ప‌ర్యట‌న‌కు వ‌చ్చినా.. అభిమానులు కుప్ప‌లు తెప్ప‌లు గా వ‌స్తుంటారు. అయితే.. ఇదంతా రాజ‌కీయంగా ఆయ‌న‌కు ప్ల‌స్ కావ‌డం లేదు. ప‌వ‌ర్ స్టార్‌గా పేరుండ‌డంతో ఆయ‌న‌ను చూసేందుకు వ‌స్తున్నారే త‌ప్ప‌.. ప‌వ‌న్‌కు రాజ‌కీయంగా ఇది క‌లిసిరావ‌డం లేదు.

గ‌త 2019 ఎన్నిక‌ల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి కూడా ఒక్క‌చోట కూడా ప‌వ‌న్ విజ‌యాన్ని అందుకోలేక పోయారు. పోనీ.. ఆ త‌ర్వాత అయినా.. పార్టీని ప‌టిష్టంగా ముందుకు తీసుకువెళ్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఏ హోదా కోసం అయితే.. కేంద్రంలోని బీజేపి నితిట్టిపోశారో.. అదే పార్టీతో ఎన్నిక‌లు ముగిసి.. ఇంకా వేడి కూడా చ‌ల్లార‌క‌ముందే వెళ్లి పొత్తు పెట్టుకున్నారు. ఇది ఆయ‌న‌కు ప్ర‌ధాన మైన‌స్‌గా మారిపోయింది. అదేస‌మ‌యంలో పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను కూడా నిల‌బెట్టుకోలేక పోయార‌నేది కూడా మైన‌స్‌గా మారింది. ఇక‌, ఇటీవ‌ల తిరుపతి ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కించుకుని తీరుతామని ప్ర‌క‌టించి.. ప్ర‌తిజ్ఞ‌లు చేసి కూడా చ‌తికిల‌ప‌డి బీజేపీకి స‌రెండ‌ర్ అయిపోయారు.

తిరుప‌తి పోరులో ప్ర‌చారం చేసిన‌ప్ప‌డు.. భారీ ఎత్తున అభిమానులు త‌ర‌లివ‌చ్చారు. దీంతో బీజేపీ నేత‌లు ప‌వ‌న్ అభిమాన ఓట్ల‌న్నీత‌మ‌కు ప‌డతాయ‌ని అనుకున్నారు. తీరా ఫ‌లితం వ‌చ్చాక‌.. నోటాకు ప‌డిన ఓట్లు కూడా ఇక్క‌డ‌పడ‌క‌పోవ‌డాన్ని బ‌ట్టి ప‌వ‌న్ ఇమేజ్ కేవ‌లం.. ఈల‌లు, గోల‌లు, రెండు డైలాగులు.. నాలుగు తిట్ల‌కే ప‌రిమితంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. కొన్ని కొన్ని గ్రామాల్లో ప‌వ‌న్ పార్టీ పేరు చెప్పినా.. గుర్తించే జ‌నాలు లేక‌పోవ‌డం.. అదేంటి ? అని ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌,, ఇప్పుడు పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించేందుకు, పార్టీ జెండా మోసేందుకు కూడా ప‌ట్టుమ‌ని ప‌దిమంది లేక‌పోవ‌డం చూస్తే.. ప‌వ‌న్ పార్టీ కేవ‌లం ఏదొ ఒక పార్టీకి మ‌ద్ద‌తుగా ఉండాల్సిందే త‌ప్ప‌.. స్వ‌యంగా రాజ‌కీయాలు చేయ‌డం.. సొంత‌గా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డం అనే విష‌యాల‌కు ప‌నికిరాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ప‌వ‌న్ మున్ముందు ఏంచేస్తారో చూడాలి.

Tags:    

Similar News