ఉపఎన్నికలో బీజేపీ అస్త్రమేమిటో అర్ధమైందా ?

Update: 2021-04-04 12:30 GMT
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక విషయంలో కమలంపార్టీ అజెండా ఏమిటో స్పష్టంగా జనాలకు అర్ధమైపోయింది. పశ్చిమబెంగాల్, అస్సాం ఎన్నికల్లో ఏమో అభివృద్ధి, జాతీయ వాదం లాంటి అంశాలపై మాట్లాడుతున్న కమలనాదులు తిరుపతిలో మాత్రం మతమే ప్రధాన ఆయుధంగా వాడుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణుకుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఉపఎన్నిక హిందువులకు, హిందు ద్రోహులకు మధ్య పోరాటంగా అభివర్ణించటమే విచిత్రంగా ఉంది.

ఆమధ్య తెలంగాణా పార్టీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ బైబిల్ పార్టీ కావాలో భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోవాలని జనాలకు అల్టిమేటమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దుబ్బాక ఎంఎల్ఏ ఎం. రఘునందనరావు తిరుపతిలో మాట్లాడుతూ తొందరలో బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ మొదలుపెడుతుందని గట్టిగానే హెచ్చరించారు. ఒకేసారి అటు తెలంగాణాలోను, ఇటు ఏపిలోను స్ట్రైక్స్ మొదలవుతాయని కూడా ప్రకటించేశారు.

బీజేపీ నేతల వరస చూస్తుంటే ఏపి ప్రయోజనాలకు విభజన చట్టంలో చెప్పిన ప్రత్యేకహోదా, వైజాగ్ కేంద్రంగా ప్రైత్యేకరైల్వేజోన్ తో పాటు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాలు చర్చకు రాకుండా  జనాల మైండ్ సెట్ మార్చేందుకు అవస్తలు పడుతున్నట్లే కనబడుతోంది. కమలనాదులు ఎంత ప్రయత్నించినా జనాల మూడ్ ను మార్చలేరని అర్ధం చేసుకోలేకపోతున్నారు.

ఎందుకంటే ఏపి ప్రయోజనాలను నరేంద్రమోడి తుంగలో తొక్కేస్తున్నారని జనాల్లో బలంగా ముద్రపడిపోయింది. అసలు బీజేపీ నేతలు చెబుతున్నట్లు భగవద్గీత పార్టీ ఎవరిదో ? బైబిల్ పార్టీ ఎవరిదో అర్ధం కావటంలేదు. హిందువులెవరో ? హిందు ద్రోహులెవరో ? జనాలకు అర్ధం కావటంలేదు. ఏపిలో సర్జికల్ స్ట్రైక్స్ ఎక్కడ చేస్తారో ? ఎవరిపై చేస్తారో ? అర్ధం కావటంలేదు.

సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో లాభపడినట్లు ఇపుడు కూడా లాభపడదామని చూస్తున్నట్లున్నారు. ఉపఎన్నికలో బీజేపీ గెలుపుసంగతి దేవుడెరుగు కమలనాదులంతా కలిసి తిరుపతిలోని ప్రశాంత వాతావరణాన్ని గబ్బు లేపేసేట్లే ఉన్నారు చూస్తుంటే. ఇంతా చేసి డిపాజిట్ తెచ్చుకునేందుకేనా కమలనాదుల పోరాటం ?
Tags:    

Similar News