టీడీపీ వల్ల లాభపడేది ఎవరో తెలుసా

Update: 2021-04-04 13:30 GMT
పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయం వల్ల లాభపడే రాజకీయపార్టీ ఏది ? అనేది ఇపుడు చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ చీఫ్ సోమువీర్రాజు మాట్లాడుతు టీడీపీకి ప్రత్యామ్నాయం తామే అని ప్రకటించేశారు. టీడీపీ బహిష్కరణ అస్త్రం వల్ల తమకే లాభమని కమలనాదులు అంచనాలు వేసుకుంటున్నట్లు అనుమానంగా ఉంది. అయితే బీజేపీకన్నా జనసేనకే ఎక్కువ లాభమనే అంచనాలు కూడా ఉన్నాయి.

 ఎలాగంటే మొన్నటి పంచాయితి ఎన్నికల్లో కూడా బీజేపీకన్నా జనసేనే ఎక్కువ పంచాయితిల్లో గెలిచింది. ఇందుకు కారణం ఏమిటంటే పార్టీ గుర్తులు లేకుండా జరిగిన ఎన్నికలు కాబట్టి కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల టీడీపీ+జనసేన నేతలు కలిసిపోయారు. సర్పంచ్ స్ధానంలో టీడీపీకి జనసేన మద్దతుదారులు సాయం అందించారు. దానికి ప్రతిఫలంగా ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల్లో జనసేన మద్దతుదారులకు టీడీపీ నేతలు మద్దతుగా నిలిచారు.

 ఈ విధంగానే కొన్ని సర్పంచ్ స్ధానాలను, వార్డు మెంబర్లుగా జనసేన మద్దతుదారులు గెలవగలిగారు. జనసేనమిత్రపక్షమైన బీజేపీ మద్దతుదారులకు మాత్రం టీడీపీ నేతలు మద్దతుగా నిలవలేదు. ఇక ప్రస్తుతానికి వస్తే టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిచింది కాబట్టి స్వేచ్చగా జనసేన అభ్యర్ధులకు మద్దతు తెలిపినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎలాగూ తమ పార్టీ అభ్యర్ధులు పోటీలో లేనిచోట్ల టీడీపీ నేతలు ఎవరికి మద్దతిచ్చినా ఎవరూ తప్పు పట్టేదికూడా ఉండదు.

ఇదే సమయంలో కొన్ని జిల్లాల్లో మాత్రం టీడీపీ నేతలు పోటీ చేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం, విశాఖపట్నం లాంటి జిల్లాల్లో కొన్నిచోట్ల టీడీపీ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. బహుశా ఇలాంటి చోట్ల అంటే ఎక్కడైతే టీడీపీ పోటీచేస్తోందో అక్కడ జనసేన నేతలు మద్దతుగా నిలిచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి.

 అంటే బీజేపీ, జనసేనలు పేరుకు మాత్రమే మిత్రపక్షాలు. పరిషత్ ఎన్నికల్లో బీజేపీ పోటీ ఒంటరిగానే ఉండబోతోంది. ఇదే సమయంలో అవకాశం ఉన్న చోట్లలో జనసేన-టీడీపీ నేతలు పరస్పర మద్దతుతో ఎన్నికలను ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సో క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే టీడీపీ బహిష్కరణ అస్త్రం వల్ల జనసేనే ఎక్కువగా లబ్దిపొందే అవకాశాలు కనబడుతున్నాయి.
Tags:    

Similar News