మనకు కరోనా తీవ్రత తక్కువేనట.. భారీ రిలీఫ్ ఇస్తున్న ఆ వైద్యుడి మాటలు

Update: 2020-03-30 04:43 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఆ మాటకు వస్తే అంతర్జాతీయంగా గ్యాస్ట్రో ఎంటరాలజీలో ప్రముఖ వైద్యుడిగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. కేవలం ఆయన దగ్గర వైద్యం చేయించుకోవటం కోసం వివిధ దేశాల నుంచి పలువురు ప్రముఖులు హైదరాబాద్ కు వచ్చి వైద్యం చేయించుకొని వెళతారు. కొందరు సెలబ్రిటీలు.. ప్రముఖులు అయితే.. ఆయనతో తప్పించి.. మరెవరితోనూ వైద్యం చేయించుకోవటానికి అస్సలు ఇష్టపడరు. ఆయన అపాయింట్ మెంట్ దొరకటం చాలా కష్టంగా పలువురు చెబుతుంటారు. అదే సమయంలో ముఖ్యమైన కేసు అయితే.. వారు పేదవారైనా సరే.. తానే స్వయంగా అటెండ్ అయ్యే లక్షణం నాగేశ్వర్ రెడ్డి సొంతం.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వేళ.. ఈ వైరస్ గురించి ఆయనేమనుకుంటున్నారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ప్రాశ్చాత్య దేశాలతో పోలిస్తే.. మన దేశంలో దీని తీవ్రత ఎందుకు తక్కువగా ఉందన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానాన్ని ఇస్తున్నారు. ప్రాశ్చాత్య దేశాలతో పోలిస్తే కొవిడ్ 19 తీవ్రత భారత్ లో తక్కువగా ఉండే అవకాశం ఉందన్న భారీ రిలీఫ్ మాటను ఆయన చెప్పారు.

కరోనా వైరస్ జన్యు పరిణామ క్రమంలో చోటు చేసుకున్న మార్పులే.. మన దేశానికి ఊరటనివ్వనున్నట్లుగా చెప్పారు. కరోనా వైరస్ కొమ్ములు బాధితుల శరీరంలోని అంతర్గత కణాలకు అంటుకోవటం లేదని.. ఈ కారణంతోనే మనకు తీవ్రత తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మన దగ్గరకు వచ్చేసరికి కొమ్ములు బలహీనంగా మారిపోవటం లాభంగా మారింది. ఈ కారణంతోనే అమెరికా.. యూరప్ తో పోలిస్తే.. తీవ్రత తక్కువగా ఉండటానికి కారణమని చెబుతన్నారు.

భారతీయుల శరీరాల్లో రోగ నిరోధక ఎక్కువేనని.. మన వాతావరణ పరిస్థితులు కూడా వైరస్ కు ప్రతికూలంగా ఉన్నాయన్నారు. తన అంచనా ప్రకారం ఇటలీ.. అమెరికాలో నెలకొన్న పరిస్థితులు మన దగ్గర చోటు చేసుకోవన్నారు. అదే సమయంలో ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు కూడా బాగున్నాయని చెబుతున్నారు. వేసవిలో ఈ వైరస్ తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్పిన ఆయన.. అలా అని వంద శాతం తగ్గుతుందని చెప్పలేమన్నారు. ఒకవేళ ఎండాకాలంలో తగ్గినా.. వాతావరణ పరిస్థితులు మారినంతనే మళ్లీ వైరస్ జాడలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు.

కేసుల సంఖ్య తగ్గినా.. జాగ్రత్తలు కొనసాగించాలని.. వచ్చే ఏడాది చలికాలానికి టీకా వస్తుందని.. అప్పటివరకూ మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెప్పారు. గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపించదని..కాకుంటే సెల్ ఫోన్ మీద 48 నుంచి 72 గంటల సేపు ఉంటుందని.. అందుకే మొబైల్ ను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీలైనంత వరకూ ఒకరి మొబైల్ మరొకరు వాడకపోవటమే మంచిదన్నారు. సో.. మిగిలిన జాగ్రత్తలతో పాటు.. వేరే వారి మొబైల్ వాడకపోవటం చాలా సేఫ్ అన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News