దేశంలోనే ఇప్పటి వరకు అత్యంత సంపన్నమైన అభ్యర్థి ఈమే.. ఆస్తుల విలువ రూ. 6వేల కోట్లు..

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా, లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా 58 ఏళ్ల లీమారోస్‌ పోటీ చేయనున్నారు.;

Update: 2026-04-08 05:03 GMT

ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల ఆస్తుల వివరాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ, తమిళనాడులోని తిరుచ్చి జిల్లా నుంచి పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి ఆస్తుల జాబితా చూస్తే మాత్రం సామాన్యులకే కాదు, రాజకీయ ఉద్దండులకు కూడా నోట మాట రావడం లేదు. వేల కోట్ల ఆస్తులు, కిలోల కొద్దీ బంగారం, వజ్రాలు.. ఇలా ఆ అఫిడవిట్‌లో ఉన్న అంకెలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆ సంపన్న మహిళ ఎవరు? ఆమె వద్ద ఉన్న ఆ అంతులేని సంపద ఎంత? అక్షరజ్ఞానం తక్కువైనా అపర కుబేరురాలిగా ఎలా నిలిచారో చూద్దాం.

అన్నాడీఎంకే అభ్యర్థిగా లీమారోస్

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా, లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా 58 ఏళ్ల లీమారోస్‌ పోటీ చేయనున్నారు. ప్రముఖ లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత మార్టిన్‌ సతీమణి అయిన ఆమె, ఇటీవల అన్నాడీఎంకేలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆమె సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

వెలకట్టలేని బంగారం, వజ్రాల రాశి

లీమారోస్ సమర్పించిన వివరాల ప్రకారం.., ఆమె వద్ద సంపద కేవలం నగదు రూపంలోనే కాదు.., ఆభరణాల రూపంలోనూ భారీగా ఉంది. తన పేరుపై ఏకంగా 19 కిలోల బంగారం, 1,217 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయని ఆమె పేర్కొంది. ఇవి కాకుండా 13 కిలోల వెండి, 33 గ్రాముల ప్లాటినం ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. ఒక అభ్యర్థి వద్ద ఇంత భారీ మొత్తంలో ఆభరణాలు ఉండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఆస్తులు, అప్పుల లెక్కలు

లీమారోస్‌కు వ్యక్తిగతంగా రూ.139.63 కోట్ల చరాస్తులు, రూ.909.94 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. అంటే ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.1,049 కోట్లు. ఇంత ఆస్తి ఉన్నప్పటికీ ఆమెకు రూ.8.57 కోట్ల అప్పులు కూడా ఉండడం గమనార్హం. ఇక ఆమె భర్త మార్టిన్‌ పేరుపై రూ.887.36 కోట్ల చరాస్తులు, ఏకంగా రూ.3,262 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. భర్త వద్ద కూడా వందల గ్రాముల బంగారం, కిలోల కొద్దీ వెండి, ముత్యాలు ఉన్నాయని ఆమె వివరించారు.

కుటుంబ మొత్తం ఆస్తి

కేవలం భార్యాభర్తలే కాకుండా, వారి కుమారుడు జోస్‌ చార్లెస్‌ మార్టిన్‌ పేరున రూ.655 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. మొత్తంగా ఈ కుటుంబం ఆస్తుల విలువ రూ.6 వేల కోట్లకు పైగా ఉంటుందని అఫిడవిట్ ద్వారా తెలుస్తోంది. ఆరో తరగతి వరకు మాత్రమే చదివిన లీమారోస్‌పై ప్రస్తుతం 4 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కూడా ఆమె స్వయంగా వెల్లడించారు.

భారత రాజకీయాల్లో అత్యంత సంపన్న అభ్యర్థుల జాబితాలో లీమారోస్ పేరు ఇప్పుడు మొదటి వరుసలో చేరింది. అయితే, భారీ ఆస్తులు ఉండడం ఎన్నికల్లో గెలుపునకు గ్యారెంటీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. తమిళనాడు ఓటర్లు కేవలం సంపదను చూసి ఓటేస్తారా? లేక ప్రజా సేవను చూస్తారా? అనేది ఎన్నికల ఫలితాలే తేల్చాలి. ఏదేమైనా, ఈ 'లాటరీ కింగ్' కుటుంబం రాజకీయ ప్రవేశం తమిళనాడు ఎన్నికల రణక్షేత్రాన్ని మరింత వేడెక్కించింది.

Tags:    

Similar News