10 పాయింట్ల ఫార్ములా : ఇరాన్ డిమాండ్లు ఏంటి? అమెరికా ఎందుకు అంగీకరించింది?

గత ఐదు వారాలుగా పశ్చిమాసియాను వణికించిన యుద్ధ మేఘాలు తాత్కాలికంగా తొలగిపోయాయి.;

Update: 2026-04-08 05:00 GMT

గత ఐదు వారాలుగా పశ్చిమాసియాను వణికించిన యుద్ధ మేఘాలు తాత్కాలికంగా తొలగిపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. వాటికి ధీటుగా ఇరాన్ చేస్తున్న ప్రతిదాడులతో అంచున నిలిచిన ప్రపంచ యుద్ధం ముప్పు ప్రస్తుతానికి తప్పింది. ఇరు పక్షాల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ అమలు చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ చారిత్రాత్మక పరిణామం వెనుక పొరుగు దేశం పాకిస్తాన్ కీలక మధ్యవర్తిత్వం వహించడం విశేషం.

రంగంలోకి పాకిస్తాన్.. ఫలించిన దౌత్యం

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ సైనిక అధిపతి జనరల్ అసిమ్ మునీర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి స్వయంగా పాక్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సానుకూల నిర్ణయం కూడా ఈ ప్రక్రియకు దోహదపడిందని పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు ప్రారంభం కానున్నాయి.

ఇరాన్ 10 పాయింట్ల ప్రతిపాదన.. ప్రధాన డిమాండ్లు

చర్చల కోసం ఇరాన్ ఒక సమగ్రమైన 10 పాయింట్ల ముసాయిదాను పాకిస్తాన్ ద్వారా అమెరికాకు పంపింది. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితేనే శాశ్వత శాంతి సాధ్యమని టెహ్రాన్ సంకేతాలిచ్చింది. ఆ కీలక అంశాలు ఇవే..

1. దాడుల నిలుపుదల చేయాలి. ఇరు పక్షాలు సైనిక చర్యలను తక్షణమే పూర్తిగా నిలిపివేయాలి.

2. ఇరాన్‌పై ఉన్న అన్ని రకాల ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను ఎత్తివేయాలి.

3. యురేనియం సుసంపన్నతపై ఇరాన్ సార్వభౌమ అధికారాన్ని గుర్తించాలి.

4. గతంలో జరిగిన దాడుల వల్ల కలిగిన నష్టానికి ఇరాన్‌కు పరిహారం చెల్లించాలి.

5. పశ్చిమాసియా ప్రాంతం నుంచి అమెరికా సైనిక బలగాలను వెనక్కి తీసుకోవాలి.

6. లెబనాన్‌లో హిజ్‌బుల్లాతో కాల్పుల విరమణ అమలు చేయాలి. మిత్రదేశాల సైనిక స్థావరాలను తొలగించాలి.

7. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం రద్దు చేయాలి..

8. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానాలు రద్దు చేయాలి.

9. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగించాలి.

10. ఎట్టి పరిస్థితుల్లోనూ పరస్పర దాడులకు దిగకూడదు.

హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటి హోర్ముజ్ జలసంధి వ్యవహారం ఈ చర్చల్లో అత్యంత కీలకంగా మారింది. ఈ మార్గాన్ని మూసివేస్తామని గతంలో ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో నౌకాయానం సజావుగా సాగేలా చూడాలని అమెరికా షరతు పెట్టింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఇరాన్, తమ సైనిక దళాల పర్యవేక్షణలో సురక్షిత నౌకాయానాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు స్థిరపడే అవకాశం ఉంది.

అప్రమత్తంగా ఇరాన్ సైన్యం

ఈ కాల్పుల విరమణను ఇరాన్ తన దౌత్య విజయంగా అభివర్ణించింది. అమెరికాను చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడంలో తాము విజయం సాధించామని టెహ్రాన్ పేర్కొంది. అయితే ఇది యుద్ధానికి పూర్తి ముగింపు కాదని ఇరాన్ స్పష్టం చేసింది. "మా దౌత్యం శాంతిని కోరుకుంటోంది. కానీ మా సైన్యం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర ప్రతీకారం తప్పదు." అని ఇరాన్ సైనిక వర్గాలు హెచ్చరించాయి.

ఇస్లామాబాద్ చర్చలపై ప్రపంచ దృష్టి

కనీసం 15 రోజుల పాటు సాగే ఈ చర్చలు.. అవసరమైతే మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉంది. ఒక సమగ్ర శాంతి ఒప్పంద ముసాయిదాను సిద్ధం చేయడమే ఈ చర్చల ప్రధాన లక్ష్యం. దశాబ్దాలుగా సాగుతున్న వైరం ఈ చర్చలతో సమసిపోతుందా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఇస్లామాబాద్‌ వైపు ఆశగా చూస్తున్నాయి.

Tags:    

Similar News