రీల్ క్యారెక్టర్ కాదు రియల్.. మదురై కోర్టు తీర్పు వెనుక లేడీ పోలీస్ నిజాయితీ

న్యాయం వైపు నిలబడటం.. ధర్మం కోసం పోరాడటం లాంటివి రీల్ పాత్రల్లో తరచూ కనిపిస్తుంటాయి.;

Update: 2026-04-08 04:55 GMT

న్యాయం వైపు నిలబడటం.. ధర్మం కోసం పోరాడటం లాంటివి రీల్ పాత్రల్లో తరచూ కనిపిస్తుంటాయి. రీల్ కు రియల్ కు మధ్య తేడా చాలా ఎక్కువ. వాస్తవ జీవితంలో డ్రామా కంటే కూడా గుండె దడే ఎక్కువగా ఉంటుంది. ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండటం.. ఒక సిద్ధాంతానికి నిదర్శనంగా నిలిచిన కారణంగా జీవన గమనం మొత్తం మారటమే కాదు.. కొన్నిసార్లు తీవ్ర సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితి. ఏది ఏమైనా.. న్యాయం కోసం ఎన్నిక కఠిన పరీక్షలకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించిన ఒక మహిళా పోలీసు కమిట్ మెంట్.. ఇద్దరు సామాన్యుల లాకప్ డెత్ వెనుక ఉన్న అసలు వాస్తవాలు బయటకు వచ్చేలా చేయటమే కాదు.. తొమ్మిది మంది పోలీసులకు ఉరి వేసిన చారిత్రక ఘటనకు ఆమె సాక్ష్యమే మూలం.

అవును.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మదురై కోర్టు తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష వేయాలన్న ఆదేశాల్ని జారీ చేసిన కేసుకు సంబంధించి.. అన్ని వాస్తవాల్ని.. నిజాల్ని కోర్టు ముందు ఉంచడటమేకాదు.. తాను చెప్పినవన్నీ నిజాలే అన్న విషయాన్ని కోర్టులో నిరూపితమయ్యేలా చేయటంలో సదరు మహిళా పోలీస్ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు ఇప్పుడు పోలీసు శాఖలోనే కాదు.. యావత్ దేశంలోనూ సంచలనంగా మారింది. దేశ వ్యాప్తంగా అందరి చూపు పడిన కేసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పటమే కాదు.. తన తోటి అధికారులకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వటానికి ఎంతో గుండెధైర్యం అవసరం. అవన్నీ తనకు ఉన్నాయన్న విషయాన్ని ఫ్రూవ్ చేసుకున్నారు హెడ్ కానిస్టేబుల్ రేవతి.

సాధారణంగా పోలీస్ స్టేషన్ లో ఏదైనా ఘటన జరిగితే.. బయటకు పొక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. రేవతి మాత్రం అందుకు భిన్నంగా.. బాధితుల పక్షాన నిలవటమే కాదు.. తన సొంత పోలీసు శాఖను వ్యతిరేకిస్తూ.. నిజాన్ని నిర్భయంగా చెప్పేందుకు సిద్ధమైంది. లాక్ డౌన్ వేళ.. వ్యాపారులు జయరాజ్.. బెన్నిక్స్ ను పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చి.. ఎంత దారుణంగా హింసించారన్న విషయాన్ని ఆమెకు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఆ తండ్రీకొడుకుల్నిరాత్రంతా తీవ్రంగా కొట్టారని.. లాఠీలు.. టేబుళ్లపై రక్తపు మరకలు ఉన్నాయని కోర్టుకు చెప్పారు. వాస్తవానికి లాకప్ డెత్ తర్వాత స్టేషన్ మొత్తాన్ని తుడిచేశారు. రక్తపు మరకల్ని పోయేలా మాప్ చేశారు. అయితే.. ఆమె ఎక్కడెక్కడ రక్తం మరకలు ఉన్నాయి? ఏ వస్తువులకు బాధితుల రక్తం అంటిందన్న విషయాన్ని వివరంగా చెప్పటమే కాదు..ఆధారాల కోసం కోర్టు అడిగిన సమాచారాన్ని ఎక్కడా మిస్ కాకుండా ఇవ్వటం ఆమె టాలెంట్ కు నిదర్శనంగా చెప్పాలి.

ఆమె ఇచ్చిన సాక్ష్యాలతోనే రక్తపు మరకలున్న వస్తువులను స్వాధీనం చేసుకోవటమే కాదు.. ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించటం సులువైంది. దీంతో.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు మామూలులోళ్లు కాదన్న విషయం లోకానికి తెలిసేలా చేసింది. మరోవైపు తోటి పోలీసులకు వ్యతిరేకంగా చెప్పే వివరాల్ని ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైంది. పోలీసుల్లోనూ ఆమె పట్ల ఆగ్రహం వ్యక్తమయ్యే పరిస్థితి. అంతేకాదు.. మేజిస్ట్రేట్ విచారణ కోసం కోర్టుకు హాజరైనప్పుడు అక్కడి పోలీసులు ఆమెకు ఎలాంటి సహకారం అందలేదు. అంతేకాదు.. తోటి పోలీసుల నుంచి ప్రాణహాని ఉందన్న ఆందోళన నేపథ్యంలో ఆమెకు.. ఆమె కుటుంబానికి ప్రత్యేక రక్షణ కల్పించారు.

సాధారణంగా తాను పని చేసే స్టేషన్ లో ఏదైనా అనూహ్య పరిణామం చోటు చేసుకొని.. సమస్యలు ఎదురైతే.. మనకెందుకు? అన్న ఉద్దేశంతో కామ్ గా ఉంటారు. కానీ.. ఆమె మాత్రం అందుకు భిన్నంగా తన డ్యూటీని నిర్వహిస్తూనే.. తన కళ్లతో తాను చూసిన అన్ని అంశాల్ని చెప్పేసింది. తన కళ్ల ముందు జరిగిన దారుణాన్ని ప్రపంచానికి తెలిసేలా చేయటంలో ఆమె కీలక భూమికను పోషించారు.అందుకే ఇప్పుడు రేవతి కొత్త స్ఫూర్తికి నిదర్శనంగా మారారని చెప్పాలి.

Tags:    

Similar News