వక్రీకరించారని వాపోతున్న ధర్మాన!

Update: 2016-08-25 08:25 GMT
నేతలు తామొక రకంగా మాట్లాడితే  మీడియాలో మరో రకంగా రావడం కొత్త సంగతి కాదు. పైగా పత్రికలు  కూడా పార్టీలకు అనుబంధ కరపత్రాలుగా మారిపోయాక.. నాయకుల మాటలను తమ పార్టీల భావజాలానికి అనుకూలంగా మార్చి వేయడం అనేది ఒక రెగ్యులర్ విషయం అయిపోయింది. సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. తన మాటలను పత్రికలు వక్రీకరించేశాయని.. అందుకు వీలున్నంత భాగాన్ని మాత్రమే తీసుకుని.. తనను బద్ నాం చేస్తున్నాయని ఆ పెద్దాయన ఇప్పుడు కుమిలిపోతున్నాడు. తన వ్యాఖ్యలు వైకాపాకు డేమేజింగ్ గా ఉండడంతో.. స్థానిక కార్యకర్తల నుంచి వస్తున్న వ్యతిరేకత కూడా. .ఆయన మరింత కుమిలిపోయేలా చేస్తోంది.

జగన్ కడపలో గెలవడం గొప్ప కాదని - శ్రీకాకుళం లో గెలవడం అంత సులువు కాదని - తాను టిడిపిలో చేరితే శ్రీకాకుళం లో గెలవడం చాలా సులువని నిన్న ధర్మాన చేసిన సంచలన కామెంట్స్ అతని అనుచరులలో కలకలం రేపుతోంది. అతన్ని నమ్ముకుని అతని వెంట వైసిపి లో చేరిన అనుచరులంతా ఇప్పుడు తమ నేత మాటల పట్ల మండిపడుతున్నారు.. వైసిపి విస్తృత స్థాయి సమావేశంలో టిడిపి ప్రస్తావన తేవడంతో దిగువ కేడరంతా తమదే పార్టీ అనే  గందరగోళ పరిస్థిలో వున్నారు. సమావేశం తర్వాత వైసిపి పార్టీ నేతలు ధర్మానను వివరణ అడిగి తెలుసుకున్నారు. కానీ ఆ వివరాలేంటో తెలియని అనుచరగణం విషయమేంటో తేల్చాలని ఆయన్ని నిలదీసినట్టు సమాచారం.

అయితే తాను పార్టీ లో తన ప్రాముఖ్యతకి  ఇస్తున్న ప్రాదాన్యం పట్ల అసంతృప్తిని తెలియచేస్తూ .ఆ మాటలు మాట్లాడేనే గాని అందులో వేరే ఉద్దేశ్యాలు లేవని, పత్రికలు  తన మాటలని వక్రీకరించి వ్రాసారని అనుచురల దగ్గర వాపోతున్నట్టు సమాచారం. తెలుగుదేశం పై తనకు ఎన్నటికీ సానుకూలత లేనే లేదని ఆయన  వచ్చిన ప్రతి ఫోనుకీ వివరణ ఇచ్చుకుంటున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News