రెండు రాజధానుల రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్

Update: 2017-01-20 10:27 GMT
దేశంలో రెండు రాజధానులున్న రాష్ట్రంగా జమ్ముకాశ్మీర్ మాత్రమే అందరికీ తెలుసు. ఇప్పుడు మరో్ రాష్ట్రం దాని సరసన చేరుతోంది. ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్న  నేపథ్యంలో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రానికి రెండో రాజధానిగా ధర్మశాలను ప్రటించారు. ధౌలాధర్ పర్వతశ్రేణిలో ఉన్న ధర్మశాల చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతమని... రెండో రాజధాని కావడానికి ధర్మశాలకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన  చెబుతున్నారు.
    
ఆ రాష్ట్రంలోని దిగువ ప్రాంతాలైన చంబా - కాంగ్రా - హమీర్ పూర్ - ఉనా జిల్లాలకు ధర్మశాల ముఖ్యమైన నగరం. రాష్ట్రంలోని మొత్తం 68 అసెంబ్లీ సీట్లలో 25 ఈ జిల్లాలలోనే ఉన్నాయి. దీంతో, ఈ ప్రాంత వాసులను ఆకట్టుకోవడానికి రెండో రాజధాని ప్రకటనను ముఖ్యమంత్రి చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
    
కాగా ప్రస్తుత రాజధాని షిమ్లాలో చేసుకునే పనులన్నింటినీ, ఇకపై ధర్మశాలలో చేసుకోవచ్చని వీరభద్రసింగ్ తెలిపారు. దలైలామా ఆశ్రమం కూడా ఇక్కడే ఉంది. అయితే, కేవలం 70 లక్షల జనాభా మాత్రమే ఉన్న హిమాచల్ ప్రదేశ్ కు రెండో రాజధానిని ప్రకటించడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
    
 అయితే.. తెలుగు రాష్ట్రం నవ్యాంధ్రకు కూడా టెక్నికల్ గా రెండు రాజధానులున్నాయని చెప్పాలి. ఉమ్మడి ఏపీ విభజన తరువాత అప్పటి వరకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. కానీ.. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిని నవ్యాంధ్రకు రాజధానిని చేశారు. కానీ.. కేంద్రం లెక్కల్లో టెక్నికల్ గా హైదరాబాద్ ఇంకా ఏపీ రాజధానిగానే ఉంది.  దీంతో నవ్యాంధ్రకూ రెండు రాజధానులున్నట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News