మాకు భూమి ఒక్కటీ చాలు!

Update: 2015-07-04 14:30 GMT
నవ్యాంధ్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్లో ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది. తమ భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చేశాం కనక అందులోని మోటార్లు.. షెడ్లు.. తదితరాలను కూడా ప్రభుత్వానికే ఇచ్చేయాలా? ఇచ్చేస్తే ప్రభుత్వం వాటిని ఏం చేసుకుంటుంది? ఒకవేళ ప్రభుత్వం తీసేసుకుంటే తాము కొంత నష్టాన్ని భరించక తప్పదా అనే సందేహాలు ముసురుకున్నాయి.

అయితే, ఈ సందేహాలను సీఆర్‌డీఏ, రెవెన్యూ అధికారులు పటాపంచలు చేస్తున్నారు. మీకే మేం భూమికి మాత్రమే పరిహారం ఇస్తున్నాం. కనక మీరు మాకు కేవలం భూములు ఇస్తే చాలు. ఇక ఆ భూముల్లో ఉన్న మిగిలిన పరికరాలన్నిటినీ మీరే తీసేసుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. మీ మోటార్లను మీరే తీసేసుకోండి. మీ షెడ్లను మీరే పీకేసుకోండి. మీ పంటలను మీరే తీసేసుకోండి. పొలాన్ని మాత్రం పూర్తిగా చదును చేసి ఇవ్వండి. మాకు ఒట్టి పొలం చాలు అని స్పష్టం చేస్తున్నారు.

ఇక, ఇప్పటి వరకు భూ సమీకరణ చేపట్టిన ప్రభుత్వం తాజాగా భూ సేకరణ కొరడాకు తెర తీస్తోంది. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ అంచనా ప్రకారం ఇంకా 1700 ఎకరాల భూమి అవసరం. దానిని ఇవ్వడానికి మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని రైతులు ససేమిరా అంటున్నారు. భూ సమీకరణను నిరసిస్తూ హైకోర్టుకు కూడా వెళ్లారు. భూ సమీకరణ తర్వాత సేకరణ తప్పనిసరి అని కోర్టుకు ప్రభుత్వం కూడా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే అతి త్వరలో భూ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేయడానికి సర్కారు రంగం సిద్ధం చేసింది.

Tags:    

Similar News