పవన్‌ కల్యాణ్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు!

Update: 2022-11-23 16:30 GMT
ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యంగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇటీవల ఏపీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పవన్‌ భేటీ అయిన తర్వాత పవన్‌ ఎందుకో సైలెంట్‌ అయ్యారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో ఇష్టం ఉన్నా, లేకపోయినా ఏపీలో టీడీపీ, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ప్రకటించిన పవన్‌ ఇప్పుడు ఎందుకు ప్రకటించడం లేదని నారాయణ వాపోవడం గమనార్హం.

ఈ మూడున్నరేళ్లలో ఏపీలో అవినీతి పెరిగిపోయిందని నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. మోడీ, జగన్‌ ప్రభుత్వాలు అవినీతికి పాల్పడుతున్నాయిని ఆరోపించారు. ఏపీలో బీజేపీ, వైసీపీ కలిసే పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించడం గమనార్హం. అందువల్లే బీజేపీని విమర్శించే సాహసం సీఎం వైఎస్‌ జగన్‌ చేయడం లేదన్నారు.

బీజేపీ, వైసీపీ అరాచకాలను అరికట్టాలంటే అందరూ కలసి రావాలని కోరారు. ఇష్టం ఉన్నా లేకపోయినా టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేయాలన్నారు. అప్పుడే ప్రజలకు మంచి జరుగుతుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read more!

ఇతర పార్టీ నేతలపై ఒత్తిడి తెచ్చేలా సీబీఐ, ఈడీలను నరేంద్ర మోడీ ప్రభుత్వం వినియోగిస్తోందని నారాయణ మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నాయకులపై దాడులు రాజకీయ కోణంలోనే సాగుతున్నాయని విమర్శించారు. దీన్ని సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దేశంలో గవర్నర్‌ వ్యవస్థ అనవసరమని నారాయణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గవర్నర్‌ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి బీజేపీ అనుకూలంగా ఉందన్నారు. అందుకే ఇక్కడి గవర్నర్‌ కూడా సైలెంట్‌గా ఉంటారు అని వ్యాఖ్యానించారు.


దేశానికి గర్వకారణమైన జీ20 సమావేశాలకు నరేంద్ర మోడీ చైర్మన్‌ ఉన్న నేపథ్యంలో ఈ సమావేశాలకు 20 దేశాల ప్రతినిధులు వస్తున్నారని నారాయణ గుర్తు చేశారు. అయితే ఈ సమావేశాలకి కమలం గుర్తు తరహాలో లోగో పెట్టడం సరికాదన్నారు. వెంటనే ఆ లోగోను మార్చాలని నారాయణ డిమాండ్‌ చేశారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఇరవై యేళ్లుగా పెండింగ్‌లో ఉందని.. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నందున ఆ బిల్లును ఆమోదించాలని నారాయణ డిమాండ్‌ చేశారు. జీ20 సమావేశాలకు ముందే మహిళా బిల్లును ఆమోదిస్తే మోడీకి గౌరవం దక్కుతుందన్నారు.

ఇప్పుడు నారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఆయనపై వైసీపీ, బీజేపీ నేతలు విరుచుకుపడే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News