అక్కడ గోమూత్రానికి పెరిగిన డిమాండ్..యజమానులకు డబ్బులే డబ్బులు

Update: 2020-10-13 09:51 GMT
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఆవుల్ని పెంచుకుంటున్న వారికి ఇప్పుడు అదనపు ఆదాయ మార్గాలు వచ్చేశాయి. ఇంతకాలం ఆవుపాలను మాత్రమే అమ్మే పరిస్థితి. మారిన అలవాట్లతో పాటు.. కొత్తగా వెలుగు చూస్తున్న వాస్తవాలతో కొత్త ఆలోచనలు చేస్తున్నారు. దీంతో.. ఆవుపాలను అమ్మి జీవించే వారికి ఇప్పుడు సరికొత్త ఆదాయ మార్గం అందుబాటులోకి రావటమే కాదు.. కాసుల వర్షం కురుస్తోందని చెబుతున్నారు.

గతంలో ఆవుపేడతో పిడకలు చేసేవారు. గడిచిన కొద్ది కాలంగా గో మూత్రం.. ఆవు పేడతో చేకూరే ప్రయోజనాల మీద పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సేంద్రీయ ఎరువుగా ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో పాటు.. మరిన్ని ప్రయోజనాలు ఉండటంతో గో మూత్రానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఆవుల్ని పెంచే వారు ఇప్పుడు వాటి పాలను లీటరు రూ.22 నుంచి రూ.25కు విక్రయిస్తుంటే.. గోమూత్రాన్ని మాత్రం లీటరు రూ.30కు అమ్మటం గమనార్హం. అన్ని చోట్ల ఇదే ధర లేకున్నా.. కనిష్ఠంగా లీటరుకు రూ.15.. గరిష్ఠంగా రూ.30 పలుకుతోంది. గోమూత్రంతో రైతుల ఆదాయంలో మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు.

సేంద్రీయ వ్యవసాయం కాన్సెప్టు అంతకంతకూ పెరిగిపోవటంతో.. ఔషధ ప్రయోజనాలు ఉన్న గోమూత్రానికి డిమాండ్ పెరిగినట్లుగా చెబుతున్నారు. కాకుంటే.. గోమూత్రాన్ని సేకరించటానికి రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు. రాత్రివేళలో గోవులు మూత్రం చేసే సమయానికి.. వాటిని బకెట్లలో పట్టాల్సి రావటం కాస్త ఇబ్బందిగా మారుతోందట. ఎందుకంటే.. రాత్రి బాగా పొద్దుపోయాక మూత్రాన్నిసేకరించటం.. పొద్దున్నే పాలు సేకరించటం కష్టంగా ఉందని చెబుతున్నారు. ఈ కష్టానికి తగినట్లుగా పని చేసే వారికి మాత్రం డబుల్ ఆదాయం వస్తోంది. రాజస్థాన్ వ్యాప్తంగా ఇప్పుడు గో మూత్రానికి భారీ డిమాండ్ నెలకొంది.

ఎక్కడి దాకానో ఎందుకు ఉదయ్ పూర్ లోని మహారాణా ప్రతాప్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో గో మూత్రానికి చాలా డిమాండ్ ఉంది. ఆ ఒక్క వర్సిటీనే నెలకు 300 నుంచి 500 లీటర్ల గోమూత్రాన్ని కొనుగోలు చేస్తోంది. ఇదే రీతిలో పెద్ద ఎత్తున గోమూత్రాన్ని కొనుగోలు చేసే వారు అంతకంతకూ పెరుగుతున్నారు. దీంతో పాల మీద వచ్చే ఆదాయానికి మించి గోమూత్రం అమ్మకంతో రావటం గమనార్హం.
Tags:    

Similar News