గుర్తుంచుకోండి.. తెలంగాణలో కోవిడ్ టెస్టు ధర తగ్గించారు

Update: 2020-11-19 07:15 GMT
సరికొత్త సంక్షేమ పథకాల్ని ప్రవేశ పెట్టటంలో ఎప్పటికప్పుడు వినూత్నంగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కీలకమైన అంశాల విషయాల్ని పట్టించుకోరన్న విమర్శ ఉంది. అందుకు తగ్గట్లే.. దేశం మొత్తం.. ఆ మాటకు వస్తే తెలంగాణకు పక్కనే ఉన్న ఏపీలోనూ కరోనా నిర్దారణ పరీక్షల ధరల్ని తగ్గిస్తే.. తెలంగాణలో మాత్రం పాత రేట్లనే వసూలు చేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలతో పాటు.. మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.

దీంతో.. స్పందించిన సర్కారు తాజాగా ఆర్టీపీసీఆర్ పరీక్షకు ప్రైవేటులో వసూలు చేస్తున్న రూ.2200 స్థానే రూ.850కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఇంటికి వచ్చి నమూనా సేకరించేందుకు ఇప్పటివరకు రూ.2800 వసూలు చేస్తుంటే.. దాన్ని రూ.1200లకు తగ్గించారు. ఈ మొత్తంలోనే పీపీఈ కిట్.. మాస్కు ఖర్చులు కూడా కలిపి ఉంటాయని మర్చిపోకూడదు.

గడిచిన మూడు నెలలుగా దేశ వ్యాప్తంగా కరోనా నిర్దారణ కిట్ల ధరలు భారీగా తగ్గాయి. ఒకప్పుడు ఒకట్రెండుసంస్థలు మాత్రమే వీటిని ఉత్పత్తి చేస్తుంటే.. ప్రస్తుతం దేశంలో 180కు పైగా సంస్థలు వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో.. ఒకప్పుడు రూ.2వేలు పలికిన కిట్ ధర ఇప్పుడు రూ.250కే లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష కు సైతం రూ.950 కంటే ఎక్కువ తీసుకోవద్దని ఐసీఎంఆర్ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి వేళ.. మిగిలిన రాష్ట్రాల కంటే ఆలస్యంగా నిర్దారణ పరీక్షల ధరల్ని తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల్ని జారీ చేసింది.
Tags:    

Similar News