భారత్ ను నరకంతో పోల్చిన ట్రంప్.. ఇరాన్ గట్టి కౌంటర్!
భారత్ నరకం అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. భారత్, చైనా మహోన్నత నాగరికతకు పుట్టిల్లు, అలాంటి నాగరికతలతోపాటు ఇరాన్ నాగరికతను నాశనం చేస్తామని ఒక యుద్ధ నేరస్థుడు అయిన అధ్యక్షుడు చెప్పడమే అసలైన నరకం అంటూ తిప్పికొట్టింది. భారత్ దేశాన్ని నరకంతో పోలుస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మైఖేల్ శావేజ్ చేసిన పాడ్ కాస్ట్ ను అధ్యక్షుడు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ లో రీపోస్టు చేశారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతుండగా, భారత్ లోని ఇరాన్ ఎంబసీలు వరుసగా కౌంటర్ లు ఇస్తున్నాయి.
శావేజ్ పాడ్ కాస్ట్ ను ట్రంప్ రీపోస్టు చేయడాన్ని ముందుగా హైదరాబాద్ లోని ఇరాన్ కాన్సులేట్ ఖండించింది. భారత్, చైనా వందల ఏళ్ల క్రితమే గొప్ప నాగరికతతో వెల్లివిరిశాయని గుర్తు చేసింది. ఇరాన్ లో పౌరులను అంతం చేస్తానన్న ట్రంప్ ప్రగల్భాలు పలికే యుద్ధ నేరగాడని మండిపడింది. రోజుకొక మాట మార్చే ట్రంప్ కు మానవత్వం మచ్చుకైనా లేదని, అతడి వ్యాఖ్యలు జాత్యహంకారానికి నిదర్శనమని హైదరాబాద్ లోని ఇరాన్ కాన్సులేట్ ఎక్స్ లో పోస్టు పెట్టింది. ఇక ఇదే అంశంపై ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కూడా ఘాటుగా స్పందించింది.
భారత్ లోని అభివృద్ధి, సాంస్కృతిక విలువలు ట్రంప్ నకు తెలిసేలా ఎవరైనా ఆయనను భారత పర్యటనకు తీసుకువస్తే బాగుండేది అంటూ ముంబైలోని ఇరాన్ ఎంబసీ ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. భారత్ కు వచ్చి చూసిన తర్వాత ఆ దేశం కోసం మాట్లాడాలని హితవుపలికింది. మహారాష్ట్రలోని అత్యాధునిక సదుపాయాలు, సంప్రదాయ వేడుకలు, పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన వీడియోను ఈ పోస్టు ద్వారా షేర్ చేసింది. అమెరికాలో అమలులో ఉన్న జన్మతః పౌరసత్వ చట్టాన్ని ట్రంప్ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్, చైనా నరక కూపాలు అంటూ శావేజ్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో రీపోస్టు చేశారు.
భారత్, చైనా నుంచి అమెరికాకు వలస వెళ్లేవారిని ‘గ్యాంగ్ స్టర్స్ విత్ ల్యాప్ టాప్స్’గా అభివర్ణిస్తూ రాజకీయ విశ్లేషకుడు శావేజ్ చేసిన పాడ్ కాస్ట్ తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపు పది నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో మైఖేల్ శావేజ్ పలు జాత్యహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు వలస వచ్చిన భారతీయులు, చైనీయులు ఈ దేశానికి నష్టం, మాఫియా కుటుంబాలన్నీ కలిపి చేసిన నష్టంకన్నా ఎక్కువ అని ఆరోపించారు. ‘‘నా ఉద్దేశంలో వాళ్లంతా గ్యాంగస్టర్స్ విత్ ల్యాప్ టాప్స్. మనల్ని నిలువునా దోచుకున్నారు. మనల్ని రెండో తరగతి పౌరుల్లా చూశారు. మూడో ప్రపంచ దేశాలు పైచేయి సాధించేలా చేశారు. మన జెండా కాలరాశారు’’ అంటూ శావేజ్ విమర్శలు చేశాడు. దీనిని ట్రంప్ రీపోస్టు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇండియా, చైనా నుంచి చాలా మంది తమకు పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం వచ్చేలా చేయడం కోసమే తొమ్మిదో నెలలో అమెరికా వస్తున్నారని శావేజ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ వైఖరిని సమర్థిస్తున్నట్లు ఉండటంతో ఆయన ఆ వీడియో పాడ్ కాస్ట్ ను రీపోస్టు చేశారని చెబుతున్నారు. కాగా, శావేజ్ వీడియోను ట్రంప్ రీపోస్టు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అధ్యక్ష కార్యాలయం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. భారత్ చాలా గొప్పదేశమని ట్రంప్ అన్నారని, ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ద్వారా ప్రకటన చేసింది. కాగా, శావేజ్ పాడ్ కాస్ట్ ను అజ్ఞానంతో చేసిన వ్యాఖ్యలుగా కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య ఉన్న వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబించవని, రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయని గుర్తు చేసింది.