ఏప్రిల్ 30న హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ పరం..అదెలానంటే?
గడిచిన కొద్దిరోజులుగా హైదరాబాద్ మెట్రో రైలును ప్రభుత్వం సొంతం చేసుకోవటానికి వీలుగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.;
గడిచిన కొద్దిరోజులుగా హైదరాబాద్ మెట్రో రైలును ప్రభుత్వం సొంతం చేసుకోవటానికి వీలుగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు.. ఎల్ అండ్ టీతో ఒప్పందం లాంటివి ఇప్పటికే జరిగాయి. వాస్తవానికి మార్చి 31 నాటికి ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వ పరం అయ్యేందుకు వీలుగా ప్లాన్ జరిగినప్పటికీ.. స్వాధీన ప్రక్రియకు అవసరమైన దాదాపు రూ.13,615 కోట్ల రుణం ప్రభుత్వానికి రాలేదు. దీంతో.. స్వాధీన ప్రక్రియ ఆలస్యమైంది.
మెట్రో మొదటిదశ స్వాధీన ప్రక్రియకు అవసరమైన రుణాన్ని ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఓకే చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఒప్పందం.. డాక్యుమెంట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పీపీపీ పద్దతిలో ఎల్ అండ్ టీ - తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టును పూర్తిగా టేకోవర్ చేసుకోవటానికి రేవంత్ సర్కారు నిర్ణయించటం తెలిసిందే.
అయితే.. స్వాధీన ప్రక్రియతో ముడిపడి ఉన్న పలు అంశాలు.. మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిపార్సులను తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. ఆమోదం తెలిపారు. ఐఆర్ఎఫ్ సీ ఇచ్చే దాదాపు రూ.13615 కోట్ల రుణాన్ని 20 ఏళ్ల కాల వ్యవధిలో మెట్రో రైలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది. కీలక అంశం ఏమంటే.. ఐఆర్ఎఫ్ సీ తొలుత అంగీకరించినరూ.12,750 కోట్ల కంటే తాజాగా రూ.13,615 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకుంది.
ఐఆర్ఎఫ్ ఎసీ రుణంగా ఇచ్చిన మొత్తానికి అదనంగా ఇవ్వాల్సిన మొత్తాన్ని హెచ్ఎండీఏ ఇవ్వనుంది. ఈ మొత్తం తక్షణం అందజేస్తేనే గడువు లోపు లావాదేవీ పూర్తి అవుతుందని హెచ్ఎంఆర్ఎల్ ప్రభుత్వాన్ని కోరగా.. ఈ అంశాన్ని మంత్రివరగంలో చర్చించారు. మెట్రో స్వాధీనం తర్వాత నిర్వాహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్ ఉద్యోగులు 115 మందిని ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకు అయ్యే వేతనాల ఖర్చును కూడా హెచ్ఎంఆర్ఎల్ భరిస్తుంది.
అదే సమయంలో మెట్రో కార్యకలాపాలపై సూచనలు.. సలహాల కోసం ఆర్నెల్ల కాలానికి ఎల్ అండ్ టీకి చెందిన సీనియర్ ఎక్స్ పీరియన్స్ అధికారిస్థాయిలోని ఏడుగురి సేవల్ని ప్రభుత్వం తీసుకోనుంది. దీనికి అయ్యే ఖర్చును ఎల్ అండ్ టీ భరిస్తుంది. వివిధ దశలను దాటి.. ఫైనల్ గా హైదరాబాద్ మెట్రో ఈ నెలాఖరు నాటికి తెలంగాణ ప్రభుత్వ పరం కానుంది.