బిగ్ బ్రేకింగ్ - ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు.. డ్రైవర్ హత్య కేసులో కీలక మలుపు
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి అరెస్టు అయ్యారు.;
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి అరెస్టు అయ్యారు. హత్య కేసులో సాక్ష్యులను బెదిరించారని అభియోగాలు ఎదుర్కొంటున్న అనంతబాబు రెండు రోజుల నుంచి పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బెయిలు రద్దు చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేయగా, దీనిపై రాజమహేంద్రవరం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఇందుకోసం భార్య లక్ష్మీదుర్గతోపాటు ఎమ్మెల్సీ అనంతబాబు కోర్టుకు హాజరయ్యారు. విచారణ నుంచి బయటకు వచ్చిన ఆయనను కాకినాడలోని సర్పవరం పోలీసులు అరెస్టు చేశారు.
కోర్టు బయట ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేసిన పోలీసులు, రాజమహేంద్రవరం నుంచి సర్పవరం తరలిస్తున్నారు. ఈ పరిణామంతో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు కీలక మలుపు తిరిగినట్లు చెబుతున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యతోపాటు మృతదేహం డోర్ డెలవరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు సాక్ష్యులను బెదిరించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నవంబరులోగా విచారణ ముగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. శుక్రవారం ట్రైల్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కాకినాడలోని తన నివాసానికి సాక్ష్యులను పిలిపించిన అనంతబాబు తాను చెప్పమన్నట్లు కోర్టులో సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
సోమవారం రాత్రి నలుగురు సాక్ష్యులను పిలిపించుకుని బెదిరించారని, ప్రలోభాలకు గురిచేశారని సర్పవరం పోలీసుస్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం సోదరుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించగా, నలుగురు సాక్ష్యులను బెదిరించిన ఉదంతం బయట పడిందని చెబుతున్నారు. సాక్ష్యుల నుంచి పోలీసులు సమాచారం సేకరించగా, డిఫెన్స్ న్యాయవాది చెప్పినట్లు చెప్పాలని ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన అనుచరులు తమపై ఒత్తిడి చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారని చెబుతున్నారు.
తాము చెప్పినట్లు నడుచుకుంటే ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున ఇస్తామని బేరం కుదుర్చుకున్నారని, అడ్వానుసుగా తలా లక్ష రూపాయలు ముందుగా చెప్పారని సాక్ష్యులు పోలీసులకు చెప్పారని అంటున్నారు. ఈ డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకునేందుకు ఆయన నివాసానికి వెళ్లగా, ఆయన అప్పటికే పరారయ్యారని ప్రకటించారు. ఇక ఆయన కోసం రెండు రోజులుగా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ ఎమ్మెల్సీ అనంతబాబు మాత్రం రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టుకు విచారణకు హాజరయ్యారు. తనపై నమోదైన కేసు కొట్టివేయాల్సిందిగా ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై ఒకపక్క విచారణ జరగాల్సివుండగా, అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు.