పుకార్లకు చెక్ పెట్టిన మల్లారెడ్డి కోడలు!
రాజకీయాల్లో ఏ చిన్న కలయిక జరిగినా దాని వెనుక పెద్ద ‘పార్టీ మార్పు’ వ్యూహం ఉంటుందని ఊహించే ఈ రోజుల్లో, మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా మారింది.;
రాజకీయాల్లో ఏ చిన్న కలయిక జరిగినా దాని వెనుక పెద్ద ‘పార్టీ మార్పు’ వ్యూహం ఉంటుందని ఊహించే ఈ రోజుల్లో, మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా మారింది. మొన్న ప్రధాని మోదీని కలవడం, నేడు బీజేపీ కార్యాలయంలో కనిపించడంతో ఆమె గులాబీ కండువా తీసేసి కాషాయ కండువా కప్పుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి కుటుంబం అంటేనే ఒక సెన్సేషన్. ఆయన శైలి, మాటలు ఎంత వైరల్ అవుతాయో, ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ అడుగులు కూడా అంతే చర్చనీయాంశంగా మారతాయి. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి వరుసగా బీజేపీ అగ్రనేతలను కలవడం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. అయితే, తన పర్యటనల వెనుక రాజకీయ ఉద్దేశ్యాలు లేవని, అవి కేవలం విద్యాసంస్థల అభివృద్ధికి సంబంధించినవని ఆమె స్పష్టం చేయడం ద్వారా ఈ ఊహాగానాలకు తెరదించారు.
ప్రధానితో భేటీ..
కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రీతి రెడ్డి కలవడంతోనే పుకార్లు మొదలయ్యాయి. ఒక బీఆర్ఎస్ నాయకురాలు నేరుగా ప్రధానిని కలవడం అనేది సాధారణ విషయం కాదు. ‘మల్లారెడ్డి కుటుంబం బీఆర్ఎస్‌ను వీడుతోందా?’, ‘కుటుంబంలో ఒకరు బీజేపీలో చేరబోతున్నారా?’ అన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఇవాళ ఆమె నేరుగా బీజేపీ సంస్థాగత కార్యదర్శి సతీష్ తివారీని కలవడానికి పార్టీ కార్యాలయానికి వెళ్లడంతో, ఇక ఆమె చేరిక ఖాయమని అందరూ భావించారు.
ఏఐ క్యాంపస్ కోసం ‘అఖిలపక్ష’ ఆహ్వానం!
అయితే, తనపై వస్తున్న వార్తలను ప్రీతి రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాను బీజేపీలో చేరడం లేదని, తన పర్యటనల వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించారు. మల్లారెడ్డి విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అత్యాధునిక ‘ఏఐ క్యాంపస్’ ప్రారంభోత్సవానికి ప్రముఖులను ఆహ్వానించడం కోసమే కలిశానని చెప్పుకస్తున్నారు. కేవలం బీజేపీ నేతలే కాకుండా, అన్ని పార్టీల కీలక నేతలను, కేంద్ర మంత్రులను ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం కలుస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. విద్యారంగానికి సంబంధించిన అంశం కాబట్టి పార్టీలకు అతీతంగా ఆహ్వానాలు పంపుతున్నట్లు వివరించారు.
ఎందుకీ అనుమానం..?
ప్రీతి రెడ్డి వివరణ ఇలా ఉన్నప్పటికీ, రాజకీయ విశ్లేషకులు మాత్రం దీనిని మరో కోణంలో చూస్తున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత బీఆర్ఎస్ నుంచి అనేక మంది నేతలు కాంగ్రెస్ లేదంటే బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డి వంటి కీలక నేతల కుటుంబంపై దృష్టి ఉండటం సహజం. గతంలో కూడా అనేక మంది నేతలు ‘వ్యక్తిగత పనులు’ అని చెప్పి అగ్రనేతలను కలిసి, ఆ తర్వాత పార్టీ మారిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ప్రీతి రెడ్డి క్లారిటీని కొందరు అనుమానంగానే చూస్తున్నారు.
విద్య, రాజకీయాల కలయిక
మల్లారెడ్డి కుటుంబం పెద్ద ఎత్తున విద్యాసంస్థలను నడుపుతోంది. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు చేపట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వ మద్దతు, జాతీయ స్థాయి గుర్తింపు అవసరం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏఐకి ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో, ప్రధానిని లేదంటే కేంద్ర మంత్రులను కలవడం వల్ల ప్రాజెక్టుకు మైలేజీ లభిస్తుందని ఆమె భావించినట్లు తెలుస్తోంది. మామ మల్లారెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నంత కాలం, కోడలు పార్టీ మారుతుందనే వార్తలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యే అవకాశం ఉంది.
రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. ప్రీతి రెడ్డి ప్రస్తుతానికి తన పర్యటనలు కేవలం 'ఏఐ క్యాంపస్' కోసమేనని మొహమాట పడకుండా చెప్పారు. ఏప్రిల్ 27న కేసీఆర్ పార్టీని ప్రక్షాళన చేయబోతున్న తరుణంలో, మల్లారెడ్డి కుటుంబం పార్టీలోనే కొనసాగుతుందా? లేదా అనే విషయంలో ఈ ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవం తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ ‘బీజేపీ ఎంట్రీ’ వార్తలకు ప్రీతి రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారు.