అనాథ శవంగా అందరి వైద్యుడు.. కరోనా విషాదం

Update: 2020-04-22 08:51 GMT
కరోనా వైరస్.. ఎలా వచ్చింది.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. కానీ ఆ అందరి వైద్యుడిని కబళించింది. ఆయనకు వ్యాధి నిర్ధారణ అయ్యి చికిత్స మొదలుపెట్టిన తర్వాత ప్రాణం పోయింది. అతడితోపాటు అతడి కుటుంబం - బంధువులంతా క్వారంటైన్ లో ఉన్నారు. దీంతో ఆ వైద్యుడి అంత్యక్రియలు ఎవరూ చేయలేని దైన్యం.. అనాథ శవంగా మారిపోయిన ఆ అందరి వైద్యుడికి చివరకు జీహెచ్ ఎంసీ అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుర్భర స్థితి ఏర్పడింది. ఇదంతా కరోనా మిగిల్చిన విషాదం మరీ..

హైదరాబాద్ లోని ఆగాపురాలో యునానీ వైద్యుడు (52) ఫేమస్. ఆయనకు ఏసీ గార్డ్స్ ప్రాంతం లో ఆస్పత్రి ఉంది. ఈయన చాలా ఫేమస్ డాక్టర్. ఈయన క్లీనిక్ కు నాంపల్లి - మసాబ్ ట్యాంక్ - ఏసీ గార్డ్స్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున రోగులు వస్తుంటారు. ఏ చిన్న సమస్య ఉన్నా చుట్టుపక్కల వారు ఈయన దగ్గరికే వచ్చేవారు.

ఎక్కడి నుంచి ఎవరు అంటించారో కానీ ఈయన పరీక్షించిన రోగి ద్వారా యునానీ వైద్యుడికి కరోనా అంటింది. ఈనెల 11న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో నాంపల్లి ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి నుంచి బంజారాహిల్స్ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకున్నాడు.

ఈనెల 13న కరోనాగా గుర్తించి యునానీ వైద్యుడిని - ఆయన కుటుంబాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అందరికీ పాజిటివ్ అని తేలింది. వారికి చికిత్స కొనసాగుతోంది.

అయితే తాజాగా మంగళవారం యునానీ వైద్యుడు మృతి చెందాడు. ఆయన భార్య - తల్లి - సోదరి - సోదరుడికి కూడా కరోనా తో గాంధీలోనే చికిత్స పొందుతున్నారు. దీంతో చివరి చూపులకు వారు నోచుకోలేదు. వైద్యుడి మృతదేహాన్ని ఎవరూ తీసుకెళ్లకపోవడంతో జీహెచ్ ఎంసీనే ఖననం చేసింది. అందరికీ సాయం చేసి వైద్యం చేసే యునానీ వైద్యుడు ఇంత దారుణంగా చనిపోవడం ఆ ఏరియాలో అందరినీ కంటతపడి పెట్టించింది.
Tags:    

Similar News