ఒకటి ఒంటరి అంకె

ఏకాంతం ఎంతో సుఖం అంటారు వేదాంతులు. అదే నిజం అంటారు భౌతిక వాదులు కూడా. అందులో ఆనందాన్ని చూసి వచ్చిన వారు అలాగే ఉంటారు.;

Update: 2026-02-01 05:47 GMT

జీవితంలో ఎందరో వస్తారో ఎందరో పోతారు. ఇద్దరు కలిస్తే జననం. నలుగురు మోస్తే మరణం. ఇది ప్రతీ వారీ జీవితం. ఈ జీవితంలో ఏమి సాధించామనుకుంటే ఎండ్ ఆఫ్ ది డే తెలుస్తుంది. నీ జీవితం అనే పుస్తకంలో చివరి పేజీని నీవు చూడలేవు. అప్పటికి నీవు భౌతికంగా ఉండవు. అయితే ప్రతీ పేజీలో నీ బలమైన ముద్ర ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఎందుకంటే ముందే చెప్పినట్లుగా జీవితం నీది అయినా దానిని ప్రభావితం చేసే వ్యక్తులు శక్తులూ సమూహాలూ ఎన్నో, అందుకే ప్రతీ వారి జీవితం సాదా సీదాగానే ప్రారంభం అయి అక్కడితోనే ముగుస్తుంది. వెలల్లో లక్షలలో కొందరే ఎంతో కొంత గుర్తింపు దక్కించుకోగలుగుతారు. ఎన్ని ఉన్నా ఎంత చేసినా నీ జీవిత ప్రయాణానికి నీవే రధివి, నీవే సారధివి అన్నది మాత్రం ఎప్పటికీ మరవరాదు.

బంధాల బాధలు :

జీవితంలో ఎన్నో బంధాలు కలుస్తాయి. కలసినపుడు ఎంతో ఆనందం ఉంటుంది. విడిపోతే బాధ తీరనిదిగా ఉంటుంది. అయితే కొన్ని బంధాలు వీడితేనే మేలు అన్నట్లుగానూ ఉంటుంది. ఇవన్నీ ఆయా బంధాలను బట్టి పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయి. ఏ బంధం అయినా శాశ్వతం కాదు అన్నది మాత్రం సదా మననం చేసుకోవాలి. ఈ మమతానురాగాలు కానీ ఈ అనుబంధాలు కానీ ఎన్నాళ్ళు అయినా చివరికి మిగిల్చేవి కన్నీళ్ళే. ఈ సత్యం తెలిసిన వారు బంధాలను ఏ విధంగా చూడాలో అలాగే చూస్తారు, ఎంతవరకూ పరిమితం చేయాలో అంతవరకే చేస్తారు. వారినే స్థిత ప్రజ్ఞులు అని అంటారు. అంతటి స్థిత ప్రజ్ఞత సాధించడం సామాన్యులకు సగటు వారికి అసాధ్యం. కానీ సాధన చేసే ఏదైనా సులువే. అందువల్ల అలాంటి సాధన ద్వారానే తరచూ పెడుతున్న ఇబ్బందులను ఈ బంధల బాధల బంధీల నుంచి వీలైనంత వరకూ తప్పించుకోవచ్చు.

ఏకాంతంతోనే :

ఏకాంతం ఎంతో సుఖం అంటారు వేదాంతులు. అదే నిజం అంటారు భౌతిక వాదులు కూడా. అందులో ఆనందాన్ని చూసి వచ్చిన వారు అలాగే ఉంటారు. ఒంటరిగా ఎక్కువగా ఉండేందుకు చేసే ప్రయత్నంలోనే జీవితం ఏంటో అర్ధం అవుతుంది. నీకు నీవుగా నిన్ను తెలుసుకోవడం కూడా జరుగుతుంది. ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి నుంచి కూడా బయటపడే మార్గం కూడా తోస్తుంది. తాత్కాలికమైన బంధాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యేకన్నా నీవు నీతో స్నేహం చేస్తూ నీతోనే ఎక్కువ సమయం గడిపితే వచ్చే అలౌకిక ఆనందం ఏదైతే ఉందో అది వెల కట్టలేనిదే. అందుకే ఆ దిశగా సాధన చేయడం చాలా అవసరం కూడా.

అత్యంత బలం :

దుర్బలులే అందరి సాయం కోరుకుంటారు అని కూడా అంటారు. పది మంది లేకపోతే తాము బతకలేమన్న మానసిక బలహీనతకు వారు లోను అవుతారు. ఎవరైతే అత్యంత శక్తివంతులుగా ఉంటారో వారంతా ఒంటరిగానే జీవిస్తున్నారు. ఒంటరి జీవితం ఎవరెస్టు శిఖరం ఎక్కినంత కష్టమే కావచ్చు. కానీ ఒక్కసారి ప్రయాణం ప్రారంభించాక అది ఎంతటి సుఖమైన ప్రయాణామో కూడా సాధకుడికే అర్ధం అవుతుంది. ఏ పేచీ పూచీలు లేకుండా ఏకాంత తీరాలలో తనను తాను తెలుసుకుంటూ తనకు అనుకూలంగా తాను మలచుకుంటూ ముందుకు సాగే వారే జీవితంలో ఎంతో సాధిస్తారు.

అసలైన కాంతిగా భ్రాంతిగా :

ఎవరి మీద ఆధారపడకపోవడం అన్నది అసలైన విజయంగా కూడా గుర్తిస్తారు చుట్టు పక్కల ఉన్న వారిని చూసి భ్రమించి తన మీద నమ్మకాన్ని త్యజించి మినుగుడు పురుగు వెలుతురునే అసలైన కాంతిగా భ్రాంతిగా చూస్తూ కాలం గడిపే వారు ఎప్పటికీ అడుగు ముందుకు వేయలేరు. అందుకే ఒకటి ఒంటరి అంకె అని తీసికట్టుగా చూడకు. ఆ ఒక్కటి శతకోటి రెట్లు సాటి అని గుర్తించడం మొదలెడితే అపుడు జీవితం ఏంటో తెలుస్తుంది. ఆ సారం కూడా అర్ధం అవుతుంది. నిజంగా జీవించడం ఏంటో కూడా ఆచరణాత్మకంగా రుజువు అవుతుంది.

Tags:    

Similar News