సూర్యాపేటను డేంజర్ జోన్ లో పడేసిన ఆ రెండు ఉదంతాలు?

Update: 2020-04-22 04:15 GMT
కరోనా వేళ.. ఒక్క తప్పు చాలు లెక్కలు మొత్తం మారిపోవటానికి. అలాంటిది రెండు ఉదంతాలు సూర్యాపేటలో షాకింగ్ పరిణామాలకు కారణంగా మారిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. మంగళవారం ఒక్కరోజులోనే సూర్యాపేటలో 26 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో తెలంగాణ ప్రభుత్వం ఉలిక్కిపడింది. హైదరాబాద్ మినహా తెలంగాణలోని ఏ జిల్లాలోనూ ఒకేరోజున ఇన్ని పాజిటివ్ కేసులు నమోదైన పరిస్థితి లేదు. ఎందుకిలా జరిగింది? దాని వెనుకున్న కారణాలు ఏమిటి? సూర్యాపేట జిల్లాకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందన్నది ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి.

దీనిపై ఆరా తీయగా.. సంచలన అంశాలు బయటకు వచ్చాయి. ఇందులో ఒక ఉదంతాన్ని చూస్తే.. పాజిటివ్ గా తేలిన వ్యక్తిని అధికారులు ఆరా తీశారు. అతనికి అనుమానస్పదమైన ట్రావెల్ హిస్టరీ లేకపోవటంతో గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. అతని సమాధానాల్లో ఎక్కడా కరోనా బారిన పడే అవకాశాలు లేక పోవటంతో మరింత అలెర్టు అయ్యారు. మరింత లోతుల్లోకి వెళ్లగా.. అప్పుడు అసలు విషయాన్ని బయటకు చెప్పుకొచ్చాడా వ్యక్తి.

ఇటీవల తానో వేశ్య వద్దకు వెళ్లానన్న విషయాన్ని చెప్పటం తో అలెర్టు అయిన అధికారులు.. వివరాలు సేకరించి సదరు మహిళను పరీక్షించగా.. ఆమెకు పాజిటివ్ అని తేలింది. ఆమెను ప్రశ్నించగా.. ఇటీవల కాలంలో దాదాపు నలభై మంది వరకూ తన వద్దకు వచ్చినట్లుగా పేర్కొన్నట్లు తెలిసిందే. దీంతో.. ఆ నలభై మంది లెక్క బయటకు తీసి..వారందరిని పరీక్షించటంతో పాటు.. వారి కాంటాక్టుల్ని సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసులు పెరిగినట్లుగా భావిస్తున్నారు.

మరోవైపు మర్కజ్ కు వెళ్లి వచ్చిన ఒక వ్యక్తి చేసే వ్యాపారం కూడా వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు. సదరు వ్యక్తికి పాజిటివ్ గా తేలటం.. అతడి షాపుకు నిత్యం పెద్ద ఎత్తున ప్రజలు రావటం కూడా కరోనా వ్యాప్తికి కారణంగా చెబుతున్నారు. ఈ రెండు ఉదంతాలు సూర్యాపేట జిల్లాలో పాజిటివ్ కేసులు భారీగా నమోదు కావటానికి కారణమని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రావాల్సి ఉంది.
Tags:    

Similar News