కాపురంలో చిచ్చుపెట్టిన కరోనా

Update: 2020-03-30 18:30 GMT
కరోనా వైరస్‌ ప్రభావం ఎంత ఉన్నా ఆ వైరస్‌ వ్యాప్తితో కొన్ని మంచి పనులు కూడా జరుగుతున్నాయి. కరోనా పరీక్షలతో కొందరి భర్తల వ్యవహారం బహిర్గతమైంది. దీంతో కరోనా వారి కాపురంలో చిచ్చు రేపింది. ఇప్పుడు ఈ వ్యవహారం అంతటా ఆసక్తికరంగా మారింది. తమ భార్యలకు బెంగళూరు వెళ్తున్నామని చెప్పి వెళ్లిన భర్తలు కరోనా పరీక్షలతో వారు బెంగళూరు కాదు బ్యాంకాక్‌కు వెళ్లారని వెలుగులోకి వచ్చింది. దీంతో వారి భార్యలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది.

హర్యానాలోని అంబాలా నగరానికి చెందిన ఇద్దరు యువకులు వ్యాపార పని మీద బెంగళూరు వెళ్తున్నట్లు వారి భార్యలకు చెప్పారు. ఇంటి నుంచి వెళ్లిన వారు కొన్ని రోజులకు తిరిగివచ్చారు. అయితే కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి ప్రయాణాలు చేసిన వారి ఇళ్లకు నోటీసులు ఇచ్చి హోం క్వారంటైన్‌లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలో వీరి ఇళ్లకు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు చూసి వారి కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. ఆ నోటీసులు చూసి తమ భర్తలను నిలదీశారు. వారిద్దరూ బ్యాంకాక్‌కు వెళ్లి వచ్చారని, విదేశాల నుంచి రావడంతో 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భర్తల వ్యవహార శైలిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార పని కోసం బెంగళూరు వెళ్తామని చెప్పి ఎంజాయ్‌ చేయడానికి బ్యాంకాక్‌ వెళ్లారా అని ప్రశ్నించారు.

భర్తల ప్రయాణ చరిత్ర (ట్రావెల్‌ హిస్టరీ) అంతా అధికారులు నోటీసుల్లో వివరించారు. వారు ఎప్పుడు.. ఎక్కడ తిరిగారో మొత్తం నోటీసుల్లో ఉంది. దీనిపై అధికారులు ఇళ్లకు వచ్చి మరీ వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయితే వారి బ్యాంకాక్‌ ఎంజాయ్‌ టూర్‌ బహిర్గతం చేయడంతో ఆ ఇద్దరు పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఎంజాయ్‌ చేయడానికి వెళ్లిన విషయం కరోనా వలన బహిర్గతం కావడంతో ఆ యువకులు షాక్‌కు గురయ్యారు. ఈ విషయం తమ భార్యలకు తెలియడంతో వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రయాణం వారి కాపురం మధ్య చిచ్చు పెట్టింది. ఈ వార్త విన్నవారంతా పగలబడి నవ్వుతున్నారు.
Tags:    

Similar News