ఈసీ వర్సెస్ టీఎంసీ : 'స్ట్రెయిట్ టాక్' అంటూ వార్నింగ్!

పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ చేసిన ట్వీట్ తీవ్ర కలకలం రేపుతోంది.;

Update: 2026-04-08 10:40 GMT

పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ చేసిన ట్వీట్ తీవ్ర కలకలం రేపుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ‘స్ట్రెయిట్ టాక్’ అంటూ ఈసీ చేసిన ట్వీట్ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఓ రాజకీయ పార్టీని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో ప్రకటన చేయడం ఇంతకు ముందు ఎప్పుడూ లేదని అంటున్నారు. కానీ, ఈసీ తొలిసారిగా టీఎంసీకి అల్టిమేటం జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సారి హింసకు తావులేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

పశ్చిమ బెంగాల్ లో ఫియర్ ఫ్రీ (భయం లేని)గా ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. ఎన్నికల కమిషన్ అధికారిక ‘ఎక్స్’ అకౌంటు నుంచి ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఫొటోను జతచేసి మరీ ఈసీ ట్వీట్ చేసింది. "ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కచ్చితంగా భయం లేనివిగా (Fear-free), హింస లేనివిగా (Violence-free) జరుగుతాయి. బెదిరింపులు, ప్రలోభాలు, రైడ్‌లు, బూత్ క్యాప్చరింగ్‌లకు తావుండదు." అంటూ ఈసీ తేల్చిచెప్పింది.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి బెంగాల్‌లో కేంద్ర బలగాల మోహరింపు, అధికారుల బదిలీల విషయంలో అధికార పార్టీ టీఎంసీ, ఈసీ మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం టీఎంసీని టార్గెట్ చేస్తూ ఘాటైన ప్రకటన విడుదల చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. గతంలో పశ్చిమ బెంగాల్ లో జరిగిన అనేక ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఈసీ పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సరళిని మార్చే ప్రయత్నంలో ఈసీ సీరియస్ గా ఉందని ట్వీట్ ద్వారా అర్థమవుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈసీ ప్రకటనపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తోంది. కేంద్ర సంస్థలను ఉపయోగించుకుని బీజేపీ ఎన్నికలను ప్రభావితం చేస్తోందని టీఎంసీ ఆరోపిస్తోంది. అయితే శాంతిభద్రతల పరిరక్షణే తమ కర్తవ్యమని ఈసీ బదులిస్తోంది. ఈ 'అల్టిమేటం' అధికార పార్టీకి గట్టి హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాల్సివుందని అంటున్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహిస్తామని చెబుతూ ఈసీ చేసిన ఈ 'స్ట్రెయిట్ టాక్' ఒక్క బెంగాల్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో కొత్త వేడిని రాజేస్తోందని అంటున్నారు.



Tags:    

Similar News