ఏపీకి కొత్త ఎన్నికల కమిషనర్.. స్థానిక ఎన్నికలకు రూట్ క్లియర్?

ఏపీలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.;

Update: 2026-04-08 10:42 GMT

ఏపీలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఖాళీగా ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియామకంతోపాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై తుది నిర్ణయం తీసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో కొద్ది రోజుల్లోనే స్థానిక ఎన్నికలకు రూట్ క్లియర్ అవుతుందని భావిస్తున్నారు. పంచాయతీ పాలకవర్గాలకు ఈ నెల 2వ తేదీతోనే గడువు తీరిపోయింది. మున్సిపాలిటీలు, జడ్పీ, మండల పరిషత్ పాలకవర్గాలకు త్వరలో గడువు తీరిపోనుందని చెబుతున్నారు. దీంతో ఎన్నికల కమిషనర్ పదవిని భర్తీ చేసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన నీలం సాహ్ని పదవీకాలం గత నెలతో పూర్తయింది. దీంతో ఆమె స్థానంలో కొత్తవారిని నియమించాల్సివుంది. నిజానికి గత ఏడాది డిసెంబరులోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నా, వైసీపీ హయాంలో నియమితులైన నీలం సాహ్ని కమిషనర్ గా ఉండగా, ఎన్నికలకు వెళ్లకూడదని ప్రభుత్వం నిర్ణయించడంతో వాయిదా పడినట్లు చెబుతున్నారు. ఇప్పుడు నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో కొత్త ఎన్నికల కమిషన్ నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వం ఫైలు పంపిందని చెబుతున్నారు.

మరోవైపు రాష్ట్ర ప్రణాళిక శాఖ బీసీ జనాభా లెక్కింపు దాదాపు పూర్తి చేసింది. ఇప్పటివరకు 99.44 శాతం వివరాలు సేకరించారని చెబుతున్నారు. మరో పది రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు. ఇక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ఖరారుకు ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ను నియమించింది. వెనుకబడిన కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేస్తుందని చెబుతున్నారు.

కాగా, నీలం సాహ్ని పదవీకాలం పూర్తవడంతో కొత్త ఎన్నికల కమిషనర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పలువురి పేర్లు పరిశీలిస్తోందని చెబుతున్నారు. సాధారణంగా ఈ పదవికి సీనియర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వానికి సన్నిహితంగా పనిచేసిన వారే ఈ పదవుల్లో నియమితులవుతారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రిటైర్డ్ చీఫ్ సెక్రటరీలు నీరబ్ కుమార్ ప్రసాద్, కె.విజయానంద్ తోపాటు సీనియర్ ఐఏఎస్ ఆర్.పి.సింగ్ పేర్లు ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నారు. విజయానంద్, నీరబ్ కుమార్ ప్రసాద్ కు సీఎస్ గా అవకాశం ఇచ్చినందున ఆర్.పి.సింగ్ పేరుపై ఎక్కువ మగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News