షాకింగ్‌.. ఆ దేశంలో మళ్లీ కరోనా మరణాలు!

Update: 2022-11-20 11:30 GMT
కరోనా పుట్టినిల్లు చైనా ప్రస్తుతం కోవిడ్‌ ఆంక్షలతో, లాక్‌డౌన్‌లతో తల్లడిల్లుతోంది. నిత్యం 10 వేల కేసులు తగ్గకుండా నమోదు అవుతున్నాయి. దీంతో చైనా కరోనా నియంత్రణకు కఠిన లాక్‌డౌన్‌లు అమలు చేస్తోంది. జీరో కోవిడ్‌ లక్ష్యంగా అమలు చేస్తున్న ఈ కఠిన ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక క్వారంటైన్‌ సెంటర్లలో ఉంటున్న ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వారంటైన్‌ సెంటర్లలో ఎలాంటి సదుపాయాలు ఉండటం లేదని ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం క్వారంటైన్‌ సెంటర్లలో జర్వం, వాంతులు, విరోచనాల బారినపడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడటంతో చైనీయుల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది.

దీంతో ఆంక్షలు కొనసాగుతోన్న ప్రాంతాల్లో 3 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నపిల్లపై ఉన్న ఆంక్షలు సడలించారు. వారికి కోవిడ్‌ నెగటివ్‌ సర్టిఫికేట్‌ అవసరం లేదని వెల్లడించారు.

మరోవైపు జీరో కోవిడ్‌ లక్ష్యంగా చైనా ప్రభుత్వం కఠిన చర్యలను అమలు చేస్తోంది. కఠిన లాక్‌డౌన్‌లపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా వెనక్కి తగ్గడం లేదు.

ఈ పరిస్థితుల్లో 6 నెలల అనంతరం అక్కడ తొలి కొవిడ్‌ మరణం చోటు చేసుకుంది. దీంతో ఇప్పటివరకు చైనాలో కోవిడ్‌ బారినపడి మృతి చెందినవారి సంఖ్య 5,227కు చేరుకున్నట్లు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

అయితే చైనాలో కోవిడ్‌ ఉధృతి కొనసాగుతున్నప్పటికీ మరణాలు మాత్రం పెద్దగా చోటు చేసుకోకపోవడం ఆ దేశానికి ఊరటనిస్తోంది. ఈ ఏడాది మేలో
షాంఘై నగరంలో ఒక వ్యక్తి కోవిడ్‌తో మరణించగా మళ్లీ ఇప్పుడు తాజాగా రెండో మరణం చోటు చేసుకుంది.

తాజాగా సంభవించిన కోవిడ్‌ మరణం చైనా రాజధాని బీజింగ్‌ నగరంలో జరిగింది. బీజింగ్‌కు చెందిన 87 ఏళ్ల వృద్ధుడు కోవిడ్‌తో మరణించినట్టు ఆ దేశ నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది.

అయితే 60 ఏళ్లకు పైబడిన వృద్ధులే కోవిడ్‌ ఇబ్బందులు పడుతున్నట్టు చైనా ప్రభుత్వం చెబుతోంది. ఆ దేశ జనాభాలో కనీసం ఒక్క డోసు తీసుకున్నవారు 92 శాతం మంది ఉన్నారు. అయితే వివిధ కారణాలతో 80 ఏళ్లకు పైబడినవారు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోలేదని సమాచారం.

ఇప్పుడు కోవిడ్‌ బారినపడుతున్నవారు.. మే నుంచి ఇప్పటివరకు నమోదైన రెండు మరణాలు కూడా వృద్ధులవేనని చెబుతున్నారు.
Tags:    

Similar News