ట్రంప్ రాక..ఢిల్లీలో రెచ్చిపోయిన నిరసనకారులు - ఇండ్లు - షాప్స్ కాల్చేశారు

Update: 2020-02-24 16:16 GMT
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన తొలిరోజే సీఏఏను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని జఫ్రబాద్ - మౌజ్‌ పూర్‌ లో రెండువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో రతన్‌ లాల్ అనే హెడ్ కానిస్టేబుల్ తలకు రాయి తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. డిప్యూటీ కమిషనర్ అమిత్‌ శర్మకు గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించారు.

చాంద్‌ బాగ్ - భజన్‌ పుర ప్రాంతాల్లోను సీఏఏకు వ్యతిరేకంగా - మద్దతిస్తున్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ట్రంప్ సాయంత్రం ఢిల్లీకి రానున్న నేపథ్యంలో ఉద్రిక్తతకు దారి తీయడం గమనార్హం. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ - లాఠీఛార్జ్ చేశారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నలుగురు - అంతకంటే ఎక్కువ గుంపులుగా తిరగవద్దని హెచ్చరించారు.

మౌజ్‌ పురిలో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. జఫ్రాబాద్‌ లో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మౌజ్‌ పుర్ - భజన్‌ పురలో నిరసనకారులు దుకాణాలకు - ఇళ్లకు నిప్పు పెట్టారు. ఓ నిరసనకారుడు చేతిలో తుపాకీతో పోలీసుల వైపు దూసుకెళ్లాడు. అతను పోలీసుల పైకి కొన్ని రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది.

ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ - లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఆరా తీశారు. శాంతిభద్రతలు పర్యవేక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. శాంతి పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు. కాగా, జఫ్రబాద్‌లో ఆదివారం నుండి ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

జఫ్రబాద్‌లో సీఏఏ అనుకూల - వ్యతిరేకుల మధ్య ఆదివారం ఘర్షణ చోటు చేసుకుంది. రోడ్లు బ్లాక్ చేశారు. హౌజ్‌రానిలోను ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సీఏఏ వ్యతిరేకులను మూడు రోజుల్లో అక్కడి నుంచి తరలించాలని బీజేపీ నేత కపిల్ మిశ్రా డిమాండ్ చేశారు. జఫ్రబాద్ - మౌజ్‌ పుర్-బాబాపూర్ స్టేషన్లకు మెట్రో రైళ్లను రద్దు చేశారు. ఇక్కడ రైళ్లు ఆగడం లేదని ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ ట్వీట్ చేసింది.


Tags:    

Similar News