వీహెచ్ తో లొల్లి పెట్టుకున్న న‌గేశ్ ముదిరాజుపై వేటు!

Update: 2019-05-13 10:42 GMT
సీనియ‌ర్లు అంటే వంగి వంగి దండాలు పెట్ట‌కున్నా.. వారి సీనియార్టీకి ఇవ్వాల్సినంత మ‌ర్యాద‌.. గౌర‌వం ఇవ్వాల్సిందే. అన‌వ‌స‌ర‌మైన దూకుడు ప‌నికి రాదు. పార్టీకి విధేయులుగా ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఉంటున్న వారి విష‌యంలో ఒకింత గౌర‌వ మ‌ర్యాద‌లు అవ‌స‌రం. అందుకు మించిన విన‌య విధేయులు కూడా చాలా అవ‌స‌రం. అందుకు  భిన్నంగా నువ్వెంత‌? అంటే నువ్వెంత‌? అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే తీరు ఏ పార్టీకైనా త‌ల‌కాయి నొప్పే.

అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం భారీగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో నేత‌ల మ‌ధ్య సంబంధాలు సిత్రంగా ఉంటాయి. అన్ని బాగున్న‌ప్పుడు భుజాలుభుజాలురాసుకుపూసుకునే నేత‌లు.. తేడా రాగానే ఇష్టారాజ్యంగా మాట‌లు అనేసుకోవ‌టం.. ఎంత పెద్ద గొడ‌వ‌కైనా సిద్ధ‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఇటీవ‌ల హైద‌రాబాద్ లోని ఇందిరాపార్కు వ‌ద్ద‌నున్న ధ‌ర్నా చౌక్ ద‌గ్గ‌ర అఖిల‌ప‌క్షం నిర్వ‌హించిన ధ‌ర్నా కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ నేత వీహెచ్.. కాంగ్రెస్ నేత న‌గేశ్ ముదిరాజుల మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గ‌టం.. ఒక‌రినొక‌రు తోసుకుంటూ కింద‌ప‌డ‌టం తెలిసిందే.

దీనిపై విప‌క్షాల‌తో పాటు.. కాంగ్రెస్ పార్టీ సైతం సీరియ‌స్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఆ రోజు జ‌రిగిన ఘ‌ట‌న‌పై వీహెచ్.. న‌గేశ్ ముదిరాజులు కాంగ్రెస్ క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం ఎదుట హాజ‌రై వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ రోజు జ‌రిగిన అన్ని అంశాల్ని లోతుగా ప‌రిశీలించాక‌.. లొల్లికి బాధ్య‌త న‌గేశ్ ముదిరాజుదేన‌ని తేల్చిన కాంగ్రెస్‌క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం.. ఆయ‌న‌పై వేటు వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఆదేశాల్ని జారీ చేశారు. త‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌టాన్ని నిర‌సిస్తూ నగేశ్ గాంధీభ‌వ‌న్ ఎదుట నిర‌స‌న‌కు దిగారు. మొత్తానికి నేత‌ల మ‌ధ్య హ‌ద్దులు మీరిన లొల్లిని పార్టీని భ‌రించ‌ద‌న్న విష‌యాన్ని తాజా చ‌ర్య‌తో స్ప‌ష్టం చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News