ఏపీలో జాతీయ పార్టీలు ల‌గేజి స‌ర్దుకోవాల్సిందే

Update: 2016-09-15 17:30 GMT
టైటిల్ చదివి.. ఇదేంటి అనుకుంటున్నారా? నిజ‌మే! ఇప్పుడు జాతీయ పార్టీల ప‌రిస్థితి ఏపీలో ఇలానే ఉంది. ఏ ముహూర్తాన రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఆవిర్భ‌వించిందో.. అప్పుడే జాతీయ పార్టీగా పేరెన్నిక‌గ‌న్న కాంగ్రెస్‌ కు ఏపీ ప్ర‌జ‌లు స‌మాధి కట్టేశారు. కాంగ్రెస్‌ జెండా ఎగిరితే చాలు తిట్లు శాప‌నార్థాల‌తో విరుచుకుప‌డ్డారు. ఇక‌, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ నేతల్లో ఏ ఒక్క‌రినీ గెలిపించ‌లేదు స‌రిక‌దా.. క‌నీసం డిపాజిట్టు ద‌క్కించుకునే ఛాన్స్ కూడా ఇవ్వ‌లేదు. పోనీ ఆ త‌ర్వాతైనా.. కాంగ్రెస్ పుంజుకుందా ? అంటే అదీలేదు. అంతేకాదు, స‌మీప భ‌విష్య‌త్తుల్లో కాంగ్రెస్ పుంజుకునే ప‌రిస్థితి కూడా లేద‌ని తేలిపోవ‌డంతో ఆపార్టీలో ఉద్ధండులైన నేత‌లు ఒక్క‌రొక్క‌రుగా పార్టీలు మారిపోతున్నారు.

 ఇక‌, ఇప్పుడు ఇదే ప‌రిస్థితి మ‌రో జాతీయ పార్టీ అయిన బీజేపీకీ త‌ప్ప‌ద‌ని అంటున్నారు పొలిటిక‌ల్ విశ్లేష‌కులు. దీనికి కూడా ఆపార్టీ స్వ‌యంకృత అప‌రాధంగానే చెబుతున్నా విశ్లేష‌కులు. ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ఇచ్చిన హామీతోనే బీజేపీకి ఏపీ ప్ర‌జ‌లు ఓట్లేశార‌ని - అయితే, ఇప్పుడు హోదా మాట‌లు గంగ‌లో క‌లిపేసి తూ.తూ. మంత్రంగా ప్యాకేజీ ఇచ్చి ఏపీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించుకుంటోంద‌ని బీజేపీపై ఏపీ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. అంతేకాదు, మొన్నామ‌ధ్య ప్ర‌త్యేక హోదా కోసం త‌ల‌పెట్టిన రాష్ట్ర బంద్‌ లోనూ బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో రానున్న రోజుల్లో బీజేపీకి కూడా ఏపీ ప్ర‌జ‌లు స‌మాధిక‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

ఇదొక‌కార‌ణ‌మైతే.. ఇప్ప‌టికే ప్రాంతీయ పార్టీలైన టీడీపీ - జ‌గ‌న్ నేతృత్వంలోని వైకాపాలు బ‌లంగా ఉండ‌డం - మ‌రోప‌క్క‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండ‌డంతో ఈ మూడు పార్టీల‌కే ఏపీలో భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని, ఎన్నిక‌ల పోరు కూడా ఈ పార్టీల మ‌ధ్యే ఉంటుంద‌ని అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు.

  ఇక‌, కామ్రేడ్లు ఉన్న‌ప్ప‌టికీ.. వీరు స్వ‌తంత్రంగా ఎలాగూ బ‌రిలోకి దిగే సాహ‌సం చేయ‌లేరు కాబ‌ట్టి వీరితో ఎలాంటి పేచీ ఉండ‌దు. అదీగాక‌ - ఇప్ప‌టికే వీళ్లు వైకాపాతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధ‌మైన సంకేతాలు కూడా ఇటీవ‌ల హోదా బంద్ సంద‌ర్భంగా వెలుగు చూశాయి. దీంతో రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ - బీజేపీల నేత‌లు ఏపీలో ల‌గేజీ స‌ర్దు కోవాల్సిందేన‌ని స్ప‌ష్ట‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. మ‌రి ఈ విష‌యాన్ని గుర్తించి ఏమైనా త‌ప్పులు స‌రిదిద్దుకుంటే త‌ప్ప‌.. బీజేపీకి కూడా కాంగ్రెస్ గ‌తే ప‌ట్టేలా క‌నిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. మ‌రి బీజేపీ హోదా విష‌యంలో త‌న రూటు ఏమైనా మార్చుకుంటుందో లేదో చూడాలి.
Tags:    

Similar News