తెలంగాణలో గెలుపు మాదే: రాహుల్‌ ధీమా వెనుక‌

Update: 2023-06-05 11:58 GMT
ఈ ఏడాది చివ‌ర‌లో  జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధిస్తామని.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ఆనవాళ్లు కూడా ఉండవని వ్యాఖ్యానించారు. ద్వేషపూరిత భావజాలంతో పనిచేస్తున్న బీజేపీని ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఓడించనున్నారని ఆయన అన్నారు. భారతీయ ప్రవాస కాంగ్రెస్‌-అమెరికా విభాగం న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన విందు సమావేశంలో రాహుల్‌ మాట్లాడారు.

తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కర్ణాటక ఫలితాలే పునరావృతమవుతాయని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లోనూ అదే జరుగుతుందన్నారు. దేశంలో విపక్షాలన్నీ ఏకమవుతున్నాయని.. ఈ సైద్ధాంతిక యుద్ధంలో కలిసి పనిచేస్తాయని ఆయన తెలిపారు. బీజేపీని ఘోరంగా ఓడించగలమని మేం కర్ణాటకలో నిరూపించామ‌న్నారు. కేవలం ఓడించడం కాదు.. ఆ పార్టీని తుడిచిపెట్టేశామ‌న్నారు. ఛిన్నాభిన్నం చేశామ‌ని వ్యాఖ్యానించారు.

'కర్ణాటక ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నించింది. మా కంటే అన్ని రకాల వనరులు ఎన్నో రెట్లు అధికంగా ఉన్న ఆ పార్టీని ప్రజాబలంతో మట్టి కరిపించాం' అని రాహుల్‌ చెప్పారు. అయితే.. ఇదేస‌మ‌యంలో ఆయ‌న తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డంతోపాటు.. బీజేపీని తుడిచి పెట్టేస్తామ‌ని చేసిన వ్యాఖ్య‌లు కూడా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. మ‌రి ఇది ఎలా సాధ్యం..?  రాహుల్ ధైర్యం వెనుక ఉన్న ధీమా ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

ఇటీవ‌ల కాలంలో కాంగ్రెస్ దూకుడు పెరిగింది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇటు కేసీఆర్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. పార్టీని బ‌లోపేతం చేయ‌డంలోనూ ముందున్నారు. అదేస‌మ‌యంలో ఆక‌ర్ష మంత్రాన్ని కూడా జ‌పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే త‌ట‌స్థ నేత‌ల‌తోపాటు.. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చేవారికి రెడ్ కార్పెట్ ప‌రుస్తామ‌ని కాంగ్రెస్‌లో ప్రాధాన్యం ఉంటుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇలా.. మొత్తంగా చూస్తే.. కాంగ్రెస్ పుంజుకునేద‌శ‌లో ఉండడం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే రాహుల్ ఈ వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Similar News