లోకల్‌ ఫైట్‌ లో కాంగ్రెస్‌ ఫస్ట్‌ హవా!

Update: 2019-06-01 04:18 GMT
కర్ణాటక ఎన్నికలు.. భిన్న ఫలితాలు అన్న చందంగా మారిపోయాయి. వారం రోజుల వ్యవధిలో ఎన్నికలు జరిగినా.. రాజకీయ పార్టీలకు మాత్రం పరీక్షగానే మారుతున్నాయి. ఎన్నికలు వెంటవెంటనే జరిగినా ఫలితాలు మాత్రం భిన్నంగా రావడం పరిపాటిగా మారింది. గత రెండేళ్ల కాలంలో కర్ణాటకలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ప్రతిసారీ క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు స్పష్టం అవుతోంది. అధికార – ప్రతిపక్షాల మధ్య జరిగిన ‘స్థానిక’ సమరంలో కాంగ్రెస్‌ పుంజుకుంది. తాజాగా జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందు వరుసలో నిలిచింది. అయితే సార్వత్రిక సమరంలో విజయఢంకా మోగించిన బీజేపీ స్థానిక సమరంలో రెండోస్థానానికి పడిపోయింది. కాగా కాంగ్రెస్‌ మిత్రపక్షంగా ఉన్న జేడీఎస్‌ ఒంటరిగా పోటీ చేసి మూడోస్థానంతో సరిపెట్టుకుంది. అయితే నగర, పురసభల్లో కాంగ్రెస్‌ ఎక్కువ స్థానాల్లో గెలువగా.. పట్టణ పంచాయతీల్లో బీజేపీ ముందంజలో నిలిచింది.

గత 2018 మే నెలలో జరిగిన విధానసభ ఎన్నికల్లో కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే కాంగ్రెస్‌ 80, జేడీఎస్‌ 37, ఇతరులు ముగ్గురు గెలిచారు. అయితే హంగ్‌ అసెంబ్లీ ఏర్పాటు కావడంతో బీజేపీ పెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే అసెంబ్లీ బల నిరూపణలో విఫలం కావడంతో బీఎస్‌ యడ్డూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్‌ – జేడీఎస్‌ జతకట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి.

విధానసభ ఎన్నికల అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమి విజయఢంకా మోగించింది. బళ్లారి, శివమొగ్గ, మండ్య ఎంపీ స్థానాలతో పాటు రామనగర, జమఖండి అసెంబ్లీ స్థానాలకు 2018లో ఉప ఎన్నికలు నిర్వహించారు. అయితే శివమొగ్గ పార్లమెంటు స్థానం మినహా మిగతా స్థానాలను కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కైవసం చేసుకుంది. గతంలో ఉన్న బళ్లారి స్థానాన్ని కూడా బీజేపీ కోల్పోయింది.

తాజాగా జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ ఏకపక్షంగా హవా సాగించింది. మొత్తం 28 స్థానాలకు గానూ 25 చోట్ల బీజేపీ జెండా ఎగిరింది. అంతేకాకుండా మండ్యలో కూడా బీజేపీ బలపరచిన స్వతంత్య్ర అభ్యర్థి సుమలత విజయం సాధించారు. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ఒక్కో స్థానానికే పరిమితం అయ్యాయి.

గత మే నెల 29వ తేదీ కర్ణాటకలో 22 జిల్లాల్లోని 56 స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనూహ్యంగా పుంజుకుంది. మొత్తం 1,221 వార్డులకు గానూ 509 స్థానాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. బీజేపీ 366, జేడీఎస్‌ 174 స్థానాలు సాధించాయి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో జత కట్టిన కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ఒంటరిగా బరిలో దిగాయి.

కర్ణాటకలో 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 124, బీజేపీ 40, జేడీఎస్‌ 40, బీఎస్‌ఆర్‌సీపీ 4, కేపీజేపీ 4,ఇతరులు 12 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఏడాది తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో 28 స్థానాలకు గానూ బీజేపీ 17 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 9, జేడీఎస్‌ 2 స్థానాలతో సరిపెట్టుకున్నాయి.

    
    
    

Tags:    

Similar News